హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చే యించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో తాజాగా లైంగిక వేధింపుల కోణం వెలుగు చూసింది. కాళోజీ వర్సిటీ అధికారులు పాస్ చేసినట్టు గుర్తించిన విద్యార్థిని హైదరాబాద్ నార్కట్‌పల్లిలో గల ఒక మెడికల్ కాలేజీలో అభ్యసించినట్టు తెలిసింది. గతంలో సదరు విద్యార్థినిని అదే కళాశాలలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు రాత్రివేళల్లో మెసేజ్‌లు పంపి ఇబ్బందులు పెట్టినట్టు తెలిసింది. దీంతో సదరు విద్యార్థిని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను గట్టిగా మందలించి వెంటనే విధుల్లో నుంచి తొలగించినట్టు తెలిసింది. ఈ ఘటన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినిపై పగ పెంచుకుని.. ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలని ప్లాన్ వేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పీజీ పరీక్షలను అదే కాలేజీలో విద్యార్థిని రాయగా.. తన పలుకుబడి ఉపయోగించిన సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జవాబు పత్రంలో రాసిన ఆన్సర్లపైనే ‘ఇంటూ’ మార్కు వేయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇక జరిగిన విషయాలను సదరు విద్యార్థినితోపాటు ఆమె పేరెంట్స్ వీసీ ఎదుట చెప్పుకోగా… ప్రత్యేక సందర్భంలో జవాబు పత్రాన్ని దిద్దించినట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
వైద్య విద్య పీజీ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్ చేశారని, జవాబు పత్రాల్లో ఇంటూ మార్కు (కొట్టివేసిన) పేజీల్లో జవాబులు రాసినట్టు ఇటీవల కాళోజీ వర్సిటీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రాథమిక విచారణ చేయించాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జడ్ చొంగ్తూను సర్కారు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఒక కమిటీని నియమించారు. విచారణలో ఓ విద్యార్థినిని పాస్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వర్సిటీ ఇటీవల విడుదల చేసిన పీజీ ఫలితాల్లో 205మంది విద్యార్థులు ఫెయిల్ కాగా, 155 మంది రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్కరూ కూడా పాస్ కాలేదు. అయితే, వర్సిటీ అధికారులు పాస్ చేసిన సదరు విద్యార్థినికి అసలు హాల్టికెటే లేదని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈనెల 21న సదరు విద్యార్థిని పాస్ అయినట్టు వెల్లడించడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను హెల్త్ సెక్రటరీకి అందజేసింది. హెల్త్ సెక్రటరీ, సీఎస్ రామకృష్ణారావు యూనివర్సిటీ వీసీ నందకుమార్రెడ్డిని వివరణ కోరారు. దీనికి వీసీ బదులిస్తూ.. విద్యార్థిని అన్ని జవాబులు రాశానని, ఫెయిలయ్యే చాన్స్ లేదని, తన ఆన్సర్ షీట్లను ఒక్కసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆన్సర్‌షీట్లను పరిశీలించిగా.. ‘ఇం టూ’ మార్కు వేసినట్టు గుర్తించామని వివరించారు. ఎవాల్యుయేటర్ల సమక్షంలో పేపర్లను మరోసారి దిద్దించి విద్యార్థినికి న్యాయం చేశామని తెలిపారు. కాగా, ఈ ఘటన సర్కారుకు మాయని మచ్చగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
సిద్దిపేట, నవంబర్ 26 : సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాలలో బుధవారం ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం విద్యార్థిపై నలుగురు సీనియర్ విద్యార్థులు మానసికంగా హింసించినట్టు విద్యార్థి, ఆయన తల్లి ఆరోపించారు. మొకు కోసం పెంచుకున్న గ డ్డాన్ని సైతం సీనియర్స్ తీయించేశారని మండిపడ్డారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కళాశాలకు వస్తే బయటే నిలబెట్టారని వాపోయారు. యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేస్తే తిరిగి తమనే బెదిరించారని తెలిపారు. తన బాబుకు సీనియర్స్‌తో హాని ఉందని ఫిర్యాదు చేశారు. కళాశాలకు చేరుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.