హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త థర్మల్‌ప్లాంట్ల ఏర్పాటుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో థర్మల్‌ప్లాంట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, అది కష్టమేనని జెన్కో ప్రాథమిక అధ్యయనంలో వెల్లడయ్యింది. ముఖ్యంగా భూసేకరణ, బొగ్గు ధరలు, బొగ్గు రవాణా, అప్పులు, వడ్డీలతో కలిపి తడిసిమోపెడయ్యే అవకాశమున్నది. పాల్వంచలో పాత యాష్‌పాండ్ సమస్యగా మారనున్నది. మక్తల్‌లో థర్మల్ ప్లాంట్ కట్టడం అంత శ్రేయస్కరం కాదన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక వనరులు కూడా సమస్య అవుతాయని, ఈ రెండు పాంట్లను కడితే ఒక్కో మెగావాట్‌కు రూ.13-14కోట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మక్తల్, పాల్వంచల్లో థర్మల్ ప్లాంట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలోనే టీజీ జెన్కో ఈ రెండు ప్లాంట్లపై ప్రాథమిక అధ్యయనం చేయించడంతో పాటు జెన్కో అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు సమాచారం. తొలి దశలోనే ఈ రెండు అనువు కాదని తేల్చగా, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
గుదిబండగా యాష్‌పాండ్
థర్మల్‌ప్లాంట్ నిర్మించేందుకు పాల్వంచలో సరిపడా స్థలం లేదు. పాత కేటీపీఎస్ స్థలంలోని పాత యాష్‌పాండ్ గుదిబండగా మారింది. 50 ఏండ్ల నుంచి బూడిదను యాష్‌పాండ్‌లో నిల్వచేశారు. దాదాపు 1,300 ఎకరాల్లో ఈ యాష్‌పాండ్ విస్తరించి ఉన్నందున కొత్త ప్లాంట్ నిర్మాణానికి స్థలం కరువైంది. స్థలం కోసం ఈ యాష్‌ను తొలగించాలి, కుదరకపోతే కొత్తగా భూసేకరణ చేయాలి. ఇది అత్యంత సమస్య కానున్నది. ఇక మక్తల్‌లో ప్లాంట్ ఏర్పాటుచేసినా బొగ్గు గనులకు దూరంగా ఉండటం, రవాణా భారంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు ప్లాంట్లకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కూడా అంత సులభం కాదనని తెలుస్తున్నది. అప్పులు తెచ్చి ప్లాంట్లు కడితే వడ్డీలతో ఆర్థిక భారం పెరిగే అవకాశమున్నది. ఇక థర్మల్ప్లాంట్లను 40శాతం ఫ్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తోనే(పీఎల్ఎఫ్) ప్లాంట్లను నడపాలి. ఇది కూడా ప్రతికూలంగా మారుతుందని విద్యుత్తురంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బెంబేలెత్తిస్తున్న బొగ్గు ధర
మన దగ్గర సింగరేణి బొగ్గు ధర అధికంగా ఉన్నందున యూనిట్ విద్యుత్తు వ్యయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.9-10 అవుతుందన్న అంచనాలున్నాయి. నాన్ పీక్ అవర్స్‌లో సోలార్ విద్యుత్తు చౌకగా దొరుకుతున్నప్పుడు కొత్త ప్లాంట్లు అవసరమా అన్న వాదనలున్నాయి. సింగరేణి సంస్థ జీ-10 గ్రేడ్ బొగ్గు టన్నుకు రూ.3,010 వసూలు చేస్తున్నది. రవాణాతో కలిపితే ఇది టన్నుకు రూ.5,670కి చేరుతున్నది. అదే మహానది కోల్‌ఫీల్డ్‌లో రూ.4,449, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో రూ.3,789, సౌత్ ఈస్ట్రన్ ఎస్ఈసీఎల్లో రూ. 3,331గా ఉంది. అదే ఇంపోర్టెడ్ కోల్ అయితే టన్నుకు రూ.6,341 పడుతున్నది. పైగా సింగరేణి నుంచి తక్కువ గ్రేడ్ బొగ్గు రావడంతో భారంగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ల వ్యయం తడిసి మోపెడవుతుందన్న వాదనలున్నాయి.
జెన్కో థర్మల్ రోడ్‌మ్యాప్ (మెగావాట్లు)
సంవత్సరం మెగావాట్లు