Degree Syllabus | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐల మాదిరిగా డిగ్రీలోనూ ప్రతి మూడు, నాలుగేండ్ల కొకసారి సిలబస్‌లో మార్పులు చేర్పులు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేయనున్నది. రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యావేత్తల నుంచి సూచనలు తీసుకోనున్నది. వచ్చే ఏడాది కల్లా కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి యోచిస్తున్నది. కొత్త సిలబస్ రూపకల్పనలో భాగంగా ఇప్పుడున్న డిగ్రీ కోర్సుల సిలబస్‌ను సమూలంగా మార్చనున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ అన్న తేడాల్లేకుండా అన్ని కోర్సుల సిలబస్‌ను మారుస్తారు.
స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలతో అనుసంధానం, ఇంటర్న్‌షిప్‌లు వంటి వాటిని ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంటారు. కాలంచెల్లిన కోర్సులు, కరిక్యులం స్థానంలో కొత్తవి ప్రవేశపెడతారు. ఇదే కాకుండా టెక్నికల్ కోర్సుల తరహాలో డిగ్రీ కోర్సుల్లోనూ అప్రెంటిషిప్ విధానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర డిగ్రీలో 501 కాంబినేషన్ల కోర్సులు ఉన్నాయి. 4.6 లక్షలకుపైగా సీట్లుంటే ఏటా 2 లక్షల విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 2.6 లక్షల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ చదివిన విద్యార్థులు కాస్త వెనకపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీకి తగ్గట్టు డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దడానికి కొత్త సిలబస్‌ను తీసుకొస్తున్నారు.