Gurukula Admissions | హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలపై ఎన్నడూ లేనివిధంగా గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే 5వ తరగతి ప్రవేశాల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయగా, విద్యార్థులు జిల్లాలకు జిల్లాలే మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికతను కోల్పోయే అవకాశం ఉన్నది. తాజాగా ఇంటర్ ప్రవేశాల్లోనూ అదే గందరగోళం నెలకొంది. ఎస్సీ గురుకుల పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సాధారణ ఇంటర్, ఒకేషనల్ జూనియర్ కాలేజీలు కలిపి 238 గురుకులాలు ఉన్నాయి. గతంలో సీవోఈ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో రాత పరీక్ష నిర్వహించి, ప్రతిభకలిగిన విద్యార్థులను ఎంపిక చేసేవారు. ఐఐటీ, నీట్ శిక్షణ అందించేవారు. ఇక ఇంటర్, ఒకేషనల్ కాలేజీల్లో ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించేవారు. కానీ ఈ ఏడాది ఎస్సీ గురుకుల సొసైటీ సీవోఈలకు సంబంధించిన రాతపరీక్షను రద్దు చేసింది.
ఎస్సీ గురుకుల సొసైటీలకు చెందిన విద్యార్థులకే సీవోఈల్లో ప్రవేశాలను కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే వారికి రాతపరీక్ష నిర్వహించింది. ఇక నాన్ సీవోఈ, ఒకేషనల్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి గత ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 25వ తేదీన ఫలితాలను వెల్లడించేందుకు సొసైటీ సిద్ధమైంది. అయితే దరఖాస్తు ప్రక్రియ అంతా గందగోళం నెలకొన్నది. వాస్తవంగా గతంలో దరఖాస్తులు స్వీకరించే సమయంలో సదరు విద్యార్థికి ఏ జిల్లాలో? ఎక్కడ ఏ కాలేజీలో, ఏ గ్రూపులో సీటు పొందాలనుకుంటున్నాడు? అనే అంశాలపై ప్రాధాన్యతాపరంగా ఆప్షన్ ఎంచుకునే అవకాశముండేది. ప్రస్తుతం తీసుకునే గ్రూపు తప్ప కాలేజీని ఎంచుకునే అవకాశాన్ని సొసైటీ దరఖాస్తు సమయంలో ఇవ్వలేదు. సొసైటీనే మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఆయా కాలేజీలకు కేటాయించే అవకాశమున్నదని తెలుస్తున్నది.
ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించి నిర్ణయమేదైనా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతి తీసుకోవాలి. బోర్డు అనుమతి లేకుండా సీట్ల కేటాయింపులో నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థనే ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నది. ఎస్సీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్లో 238కాలేజీల వివరాలను మాత్రమే వెల్లడించింది. కానీ ఏ కాలేజీలో? ఏయే గ్రూపులు ఉన్నాయనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. అదీగాక ఇటీవల దాదాపు 80గురుకుల కాలేజీల్లో గ్రూపులన్నీ మార్చింది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు, ఒకేషనల్ కోర్సుల్లో నూ మార్పులు చేర్పులు చేసింది. కొన్ని కాలేజీలను కేవలం సైన్స్ గ్రూపులకే పరిమితం చేసింది. మరికొన్ని కాలేజీలను కేవలం ఆర్ట్స్ గ్రూపులకే పరిమితం చేసింది. మరికొన్నింటిలో మిశ్రమ కోర్సులను రన్ చేయాలని నిర్ణయించింది. ఒకేషనల్ కాలేజీల్లో కాళేశ్వరం జోన్లో ఒక్క ఒకేషనల్ కాలేజీ కూడా లేకపోవడం గమనార్హం.
గౌలిదొడ్డిలోని కళాశాలలో బైపీసీ, ఎంపీసీ గ్రూపులను గతంలో నడిపారు. కానీ ప్రస్తుతం కేవలం మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు 160 సీట్లు కేటాయించారు. ఇక్కడ చదివిన మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థులు ఎకడికి వెళ్లాలి? ఇక చిలుకూరులోని బాలుర పాఠశాలలో బైపీసీ, ఎంపీసీలో 40 సీట్లు చొ ప్పున ఉండేవి. ఇప్పుడు అకడ ఎంపీసీని రద్దు చేసి, కేవలం బైపీసీలో 160 సీట్లు కేటాయించారు. మరి రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్థులను ఎకడ అడ్జస్ట్ చేస్తారు? అదేవిధంగా ఉప్పల్‌లో 200 సీట్లను, గౌలిదొడ్డి బాలికల్లో 160 సీట్లను, కరీంనగర్ అలుగునూర్‌లో 160 సీట్లను కేటాయించారు. మహేంద్రహిల్స్‌లో ఎంపీసీ రద్దు చేస్తూ బైపీసీలో 120 సీట్లను కేటాయించారు. ఫలక్‌నుమాలో ఎంపీసీని రద్దుచేసి బైపీసీలో 200 సీట్లు కేటాయించారు. ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా కాలేజీల్లో గ్రూపుల మార్పు చేశారని సొసైటీ ఉపాధ్యాయులే వెల్లడిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గద్వాల జిల్లాకు చెందిన విద్యార్థిని ఖమ్మం జిల్లాకు, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థికి హైదరాబాద్‌లో సీటును కేటాయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అనేకమంది విద్యార్థులు సొంతజిల్లాలకు బదిలీ చేయాలని ఇప్పటికే కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం లేకుండానే ఎస్సీ గురుకుల సొసైటీ ఇష్టారీతిన నిర్ణయాలను తీసుకుంటున్నదని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. వాస్తవంగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి గురుకుల సొసైటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎస్సీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్‌చైర్మన్‌గా ఉంటారు. కన్వీనర్‌గా గురుకుల సొసైటీ సెక్రటరీ, సభ్యులుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, కాలేజియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, ట్రైబల్ వెల్పేర్ చీఫ్ ఇంజినీర్, నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. వారితోపాటు ప్రభుత్వం నామినేట్ చేసే ము గ్గురు విద్యావేత్తలతోపాటు, ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. ఏడాదిలో దాదాపు బీజీ 4సార్లయినా సమావేశం కావాల్సి ఉంటుంది. అకాడమిక్ అంశాలు కాలేజీల ఏర్పాటు, కుదింపు, గ్రూపుల ఏర్పాటుతోపాటు, సొసైటీకి సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలు తదితర అంశాలపై బీజీలోనే చర్చించి తీర్మానం చేయడం పరిపాటి. కానీ ప్రస్తుతం అటు ప్రభుత్వం అనుమతి కానీ, ఇటు బీజీలో కానీ చర్చించకుండానే సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని యూనియన్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.