హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాదికాలంలో ట్రాన్స్‌కో, జెన్కోతోపాటు డిస్కంలలో దుబారాను తగ్గించి విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్తు విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని(కొత్త పునరుజ్జీవ ఇంధన విధానం) రూపొందిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విద్యుత్తురంగ విజయాలపై ప్రభుత్వం శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. తొలి ఏడాదిలో రాష్ట్రంలోని 29 లక్షల రైతుల సంక్షేమం కోసం రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్తు సబ్సిడీ భారాన్ని భరించినట్టు తెలిపింది. 200 యూనిట్లలోపు 50 లక్షల కుటుంబాలకు జీరోబిల్లులు అందించినట్టు వెల్లడించింది. 39,067 విద్యాసంస్థలకు రూ.101కోట్ల సబ్సిడీని విడుదల చేసినట్లు ప్రకటించింది. యాదాద్రి పవర్‌ప్లాంట్‌లోని 1, 2 యూనిట్లను గ్రిడ్‌కు అనుసంధానించినట్టు తెలిపింది. కొత్తగా 244 కొత్త సబ్స్టేషన్లు నెలకొల్పుతున్నట్టు, ఐదు గ్రామాలను పూర్తిగా సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు మాడల్ ప్రాజెక్టును చేపట్టినట్టు వివరించింది.