హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): అంబర్‌పేటలో నూతన పీటీవో నిర్వహణ, మరమ్మతు విభాగ భవనాన్ని రూ.59 కోట్లతో నిర్మించనున్నట్టు డీజీపీ బీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. 21 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ అధునాతన భవనంలో వర్షాప్లు, డయాగ్నస్టిక్ సిస్టమ్స్, మెయింటెనెన్స్ బ్లాక్‌లు, ఆపరేషన్ జోన్లు, ప్రత్యేక శిక్షణా మౌలిక సదుపాయాలు ఉం టాయని వివరించారు. ఆదివారం పోలీస్ రవాణా సంస్థ (పీటీవో) ప్రాంగణంలో అత్యాధునిక రిటైల్ పెట్రోల్ బంకును, సీపీఎల్ అంబర్‌పేట గ్రౌండ్స్‌లో నూతన పీటీఓ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
పోలీస్ రవాణా సంస్థ ఐజీ డాక్టర్ ఎం రమేశ్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభించిన ‘టీజీ పోలీస్ సంక్షేమ సొసైటీ-పీటీవో ఫ్యూయల్ ఔట్లెట్’ గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించి, సంక్షేమ ఆధారిత సంస్థాగత వృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పో లీస్ సంక్షేమ వనరులను పెంచడానికి, ప్ర యాణికులకు అదనపు సౌలభ్యాన్ని అందించడానికి ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఐజీ ఎం రమేశ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్, పీటీవో ఎస్పీ రాజేశ్, ఐవోసీఎల్, ఈడీ పీయూష్ మిట్టల్, సీజీఎంలు బద్రీనాథ్, ముత్తు కుమారన్ తదితరులు పాల్గొన్నారు.