నిన్న బనకచర్లతో గోదావరిని చెరపట్టాలని చూసిన ఆంధ్రప్రదేశ్.. నల్లమలసాగర్ నల్లముసుగేసుకుని మళ్లీ అవే కుట్రలకు పదును పెడుతున్నది. పోలవరం-బనకచర్ల లింక్.. పోలవరం-నల్లమలసాగర్ లింక్‌గా మారినా.. అంతిమంగా దగా పడేది తెలంగాణే. పోలవరం నుంచి బొల్లాపల్లి వరకు పాత ప్రతిపాదననే కొనసాగిస్తున్న ఏపీ.. అక్కడినుంచి బనకచర్ల వైపు కాకుండా నల్లమలసాగర్‌కు నీళ్లను మళ్లించడమే కొత్త ప్రతిపాదన. అయితే ఇవన్నీ ముసుగులే. మన జలహక్కుల్ని కాలరాసే నీటి నాటకంలో ఇవన్నీ ఎపిసోడ్లే.
నీటికుట్రలు పోలవరంతో నిలిచిపోలేదు. బనకచర్లతో ఆగిపోలేదు. నల్లమలసాగర్ అంతిమం కాదు. గోదావరి నీటిని భవిష్యత్తులో సోమశిలకు తరలించే ప్లాన్ తెరవెనుక సిద్ధంగా ఉన్నది. మన నీళ్లను కావేరికి కావడికట్టేందుకు తహతహలాడుతున్న కేంద్రం.. కత్తి నూరుతూనే ఉన్నది. అటు కేంద్రం, ఇటు ఏపీ.. కుడి, ఎడమల దగాతో తెలంగాణ ఎవుసం అమాస కానున్నది.
హైదరాబాద్, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ) : పీబీ (పోలవరం బనకచర్ల) లింక్ ప్రాజెక్టుకు (PB Link Project), పీఎన్ (పోలవరం నల్లమలసాగర్) లింకు ప్రాజెక్టుకు (PN Link Project) మధ్యన పేరొక్కటే తేడా. కానీ రెండింటి లక్ష్యం గోదావరి (Godavari) జలాలను చెరబట్టడం., అనధికార నిర్మాణాలను చట్టబద్ధం చేసుకోవడం, అంతిమంగా తెలంగాణ జలహక్కులకు గండికొట్టడమే. ఆ రెండు ప్రాజెక్టుల స్వరూప స్వభావాలు, ప్రతిపాదనలతో అదే విషయం తేటతెల్లమవుతున్నది.
పీబీఎల్పీలో భాగంగా..
ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం తొలుత రూ.81వేల కోట్లతో పీబీఎల్‌పీని చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో భాగంగా…
సెగ్మెంట్ -I
పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 28 వేల క్యూసెక్కులకు, సమాంతర తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి గోదావరి వరద జలాలను ప్రకాశం బరాజ్‌కు తరలించాలి.
సెగ్మెంట్ -II
ఏపీలోని పల్నాడు జిల్లాలో 173 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నది. ఆ తరువాత ప్రకాశం బరాజ్, పులిచింతల ప్రాజెక్టుకు మధ్య వైకుంఠపురం వద్ద అదనంగా బరాజ్‌ను నిర్మించి, దానిగుండా 6 లిఫ్ట్‌ల ద్వారా గోదావరి జలాలను ఎత్తి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తున్నది.
సెగ్మెంట్ -III
బొల్లాపల్లి నుంచి 3 లిఫ్ట్‌ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి 16 కి.మీ దిగువనున్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీకి గోదావరిజలాలను తరలిస్తున్నది. బనకచర్ల నుంచి ఇప్పటికే కృష్ణా జలాలను సోమశిలకు తరలిస్తుండటం గమనార్హం. మొత్తంగా ఇదీ పీబీఎల్పీ ప్రాజెక్టు స్వరూపం. ఈ మేరకు ప్రీఫిజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను కేంద్రానికి సమర్పించింది. ఏపీ ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కోబేసిన్ రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం పీఎఫ్ఆర్ సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) పరిశీలనలోనే ఉన్నది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్రమే పార్లమెంట్ వేదికగానూ ప్రకటించింది.
మున్ముందు బొల్లాపల్లి నుంచి సోమశిలకు ఏపీ ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు మాత్రమే జలాలను తరలిస్తామని చెబుతున్నది. కేవలం 50 టీఎంసీల గోదావరి జలాలను మళ్లిస్తామని నమ్మబలుకుతున్నా, లోపాయికారిగా గత ప్రణాళికలను యథావిధిగా చేపట్టేలా ముందుకు సాగుతున్నది. భవిష్యత్‌లో బొల్లాపల్లి నుంచి బనకచర్లకు, లేదంటే పెన్నా బేసిన్‌లోని సోమశిలకు జలాలను తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నది. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని యథాతథంగా 173 టీఎంసీలతో కొనసాగించడం, కాలువల సామర్థ్యాన్ని యథావిధిగా విస్తరిస్తామని చెప్పడమే అందుకు నిదర్శనం. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు జలాలను తరలించినా సోమశిలకు చేరుకుంటాయి. పీబీఎల్పీ ప్రాజెక్టులో భాగంగా తొలుత బనకచర్ల వరకే 2 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తామని, అక్కడి నుంచి దిగువన సోమశిలకు సైతం అదనంగా టీఎంసీని తరలించే ప్రణాళికలు కూడా ఉన్నాయని ఆ ప్రాజెక్టు పీఎఫ్ఆర్లోనే వెల్లడించింది. ప్రస్తుతం బొల్లాపల్లి నుంచి నేరుగా సోమశిల లింకును చేపట్టేందుకు సైతం ప్రత్యేకంగా పరోక్షంగా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఏదీఏమైనా మొత్తంగా 200 టీఎంసీలను గోదావరి బేసిన్ నుంచి కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడమే ఏకైక లక్ష్యంగా ఏపీ ముందుకు సాగుతున్నదని తెలిసిపోతున్నది.
సోమశిల నుంచి కావేరికి జీసీ (గోదావరి కావేరి) రివర్ లింక్ ప్రాజెక్టులో మొత్తంగా 148 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించాలనేది కేంద్ర ప్రభుత్వం చిరకాలవాంఛ. ఎన్పీపీ (నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్) కింద ఈ లింకును ప్రతిపాదించింది. అమలు కోసం దశాబ్దాలుగా యత్నిస్తున్నది. కో బేసిన్ రాష్ర్టాల అభ్యంతరాలు, ఇతరత్రా సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ లింకు ముందుకు సాగడం లేదు కానీ, ప్రస్తుతం ఏపీ చేపట్టిన పీఎన్ఎల్పీ ద్వారా ఆ కలను సాకారం చేసుకునే అవకాశమున్నదని కేంద్రం సైతం భావిస్తున్నది. అదే అదునుగా ఏపీ కూడా లింక్ ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది.
గోదావరి జలాల తరలింపే లక్ష్యం
వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా కృష్ణా జలాలు బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీకి, తద్వారా పెన్నా రివర్‌పై ఉన్న 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిల రిజర్వాయర్‌కు ఏటా మళ్లిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన వరదను వచ్చిందివచ్చినట్టుగా తరలిస్తున్నది. సోమశిల రిజర్వాయర్ నుంచి కండలేరుకు, అక్కడి నుంచి తమిళనాడు సరిహద్దులో పూండీ రిజర్వాయర్‌కు, ఆపై కావేరి గ్రాండ్ అనీకట్కు జలాలను తరలించవచ్చు. ప్రస్తుతం చెన్నైకి తాగునీటిని ఇలాగే తీసుకెళ్తున్నారు. మొత్తంగా బొల్లాపల్లి నుంచి సోమశిల లింకు ఒక్కటి చేపడితే గోదావరి-కావేరి అనుసంధానం పూర్తయినట్లే. ఆ దిశగా ఏపీ ఇప్పటికే ప్రతిపాదనలను చేస్తుండడం, కేంద్రం సైతం అందుకు సరే అన్నట్టుగా వ్యవహరించడం చూస్తుంటే గోదావరి జలాల మళ్లింపే అసలు లక్ష్యమని తేటతెల్లమవుతున్నది.

27
పేరు ఒక్కటి మార్పు పీబీఎల్పీ ప్రాజెక్టులో పలు మార్పులకు ఏపీ శ్రీకారం చుట్టింది. పీబీఎల్పీ స్థానంలో 59 వేల కోట్ల అంచనాతో పీఎన్ఎల్పీ ప్రతిపాదనలు తెరమీదకి తీసుకువచ్చింది.
పీబీ లింక్
