హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోయే ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఇంత వరకు పట్టాలెక్కలేదు. మరింత ఆలస్యమైతే పిల్లలు చేరడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 500 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధిస్తున్నారు. తాజాగా జిల్లాకు 30 చొప్పున మొత్తం వెయ్యి పాఠశాలల్లో కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సంబంధించిన మార్గదర్శకాలేవి ఇంత వరకు విడుదల కాలేదు. ఏ స్కూళ్లను ఎంపికచేశారన్నది కూడా బయటికిరాలేదు. జూన్12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానున్నది. బడుల ప్రారంభానికి మరో రెండువారాలే గడువుండగా ఇంత వరకు స్పష్టతలేదు. ఇప్పటికే చిన్నారులు ప్రైవేట్ కిండర్ గార్డెన్ స్కూళ్లల్లో చేరిపోతున్నారు. మరికొందరు చేరేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్లల్లో పాఠాలను కాంట్రాక్ట్ టీచర్లే బోధిస్తారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారితోనే పాఠాలు చెప్పిస్తారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా కొత్తగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఉంటారు. వీరితోపాటు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ తరఫున కూడా ఒక ఇన్స్ట్రక్టర్ను, ఆయాను నియమిస్తారు. రాష్ట్రంలోని చాలా అంగన్వాడీల్లో పిల్లల నమోదు తక్కువగా ఉంది. పైగా పిల్లల పేర్లను నమోదుచేసుకున్నా అంగన్వాడీలకు పిల్లలు రావడంలేదు. వచ్చే 10 మందిలోపు చిన్నారుల కోసం నలుగురు పనిచేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ విద్యార్థుల కోసం మహిళా శిశుసంక్షేమశాఖ ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు పంపిణీచేస్తున్నది. ఈ పుస్తకాలు వాడుతారా..? లేక విద్యాశాఖ ద్వారా ప్రత్యేక పుస్తకాలు సిద్ధం చేస్తారా..? అన్న ప్రశ్నలొస్తున్నాయి. మార్గదర్శకాలు విడుదల చేసి స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.