Telangana | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నది. టీజీఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)ను గుట్టుచప్పుడు కాకుండా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చుతూ గత నెల 15నే ఉత్తర్వులు జారీచేసింది. టీజీఐఐసీకి ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఆధారంగా స్టాక్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు, ఇందులో భాగంగానే కార్పొరేషన్‌ను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు చేసినట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడంతోపాటు షేర్ హోల్డర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న నాలుగు నుంచి ఏడుకు పెంచారు. ప్ర స్తుతం కంపెనీకి ఉన్న 100 షేర్లను ఏడుగురికి పంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గవర్నర్ తరఫున గవర్నర్ సంయుక్త కార్యదర్శి జే భవానీ శంకర్‌కు 94 షేర్లు కేటాయించగా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈ విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి కేఎస్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కమిషనర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి తదితర ఆరుగురికి ఒక్కోటి చొప్పున షేర్లను కేటాయించారు.
గత నెల 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా ఇన్నిరోజులూ గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పుల కోసం చేయని ప్రయత్నం లేదు. తమను ఎవరూ నమ్మడం లేదని, ఎక్కడా అప్పు పుట్టడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పారు. భూములు అమ్మి నిధులు సమకూర్చుకుందామంటే కంచ గచ్చిబౌలి వ్యవహారం తీవ్ర వివాదాస్పదమై దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. దీంతో ప్రభుత్వం టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి బాండ్లను జారీ చేయడం ద్వారా ప్రజలనుంచి నిధులు రాబట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం టీజీఐఐసీకి దాదాపు 1.50 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అత్యంత విలువైన భూములు ఉండడం గమనార్హం. కాగా వీటిలో దాదాపు 30వేల ఎకరాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించగా, ఇంకా సుమారు 1.20 లక్షల ఎకరాల భూములు టీజీఐఐసీ ఆధీనంలో ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ భూముల విలువను అంచనా వేయడం కష్టమని పేర్కొంటున్నాయి.
ఈ భూములను లేఔట్లుగా అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల్సి ఉండగా, ప్రభుత్వం ఈ ఆస్తులను ఆధారం చేసుకొని స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా బాండ్లు జారీచేసి నిధులు సమీకరించాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇదివరకే టీజీఐఐసీ నగర శివార్లలో పెద్ద ఎత్తున భూములను విక్రయించగా, ఇటీవల కంచ గచ్చిబౌలి భూములపై దాదాపు రూ.10వేల కోట్లను బ్యాంకు ద్వారా రుణంగా తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న భూములపై ఏమేరకు నిధులు సమీకరించనున్నారో ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెప్తున్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించాల్సి ఉంటుందని, ప్రస్తుత వాటాదారులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని పేర్కొంటున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఏమేరకు నిధులు సమీకరించాలనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లే నిర్ణయిస్తారు.
ఇకమీదట కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి భూముల కేటాయింపు అంత సులభం కాదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకాలం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా టీజీఐఐసీ ఆధ్వర్యంలోనే భూముల కేటాయింపు జరుగగా, పబ్లిక్ లిమిటెడ్ అయ్యాక ఏ నిర్ణయం తీసుకున్నా వాటాదారులకు సమాచారం అందించి వారి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. మెజార్టీ షేర్లు ప్రభుత్వం వద్ద ఉన్నంతకాలం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా ప్రభుత్వం పరిశ్రమలకు భూములను విక్రయించవచ్చని, ఒకవేళ వాటాదారులు ఎక్కువైతే భూముల విక్రయం అంత సులభం కాదని చెప్తున్నారు.
నిబంధనలకు లోబడి ఆస్తుల విలువ ఆధారంగా మాత్రమే బాండ్లు జారీచేసి నిధులు సేకరించే వీలు కలుగుతుందని, ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే ఆస్తులు విక్రయించి వాటాదారులకు పంచాల్సి ఉంటుందని పరిశ్రమల వర్గాలు తెలిపాయి. మొత్తమ్మీద నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ సరికొత్త ఎత్తుగడ పారిశ్రామికరంగం పాలిట శాపంగా మారనున్నదనే ఆందోళనలు పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్
కంపెనీలకు ప్రధాన తేడా ఇదే.