పుట్టంగండి పైప్‌లైన్ ప్రతిపాదన సుంకిశాలకు ప్రత్యామ్నాయమా? రూ.2200 కోట్లకు పైగా ఖర్చు చేసిన సుంకిశాల అందుబాటులోకి వస్తే ఈ కొత్త పైప్‌లైన్ వ్యవస్థ అవసరమేముంటుంది? పైప్‌లైన్ వ్యవస్థతోనే కృష్ణాజలాలను సేకరిస్తే ఇక సుంకిశాలతో పనేముంటుంది? ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేసిన సుంకిశాల పథకం కృష్ణార్పణమేనా? నిపుణుల సందేహాలకు సమాధానమిచ్చే వారేరి? నెలలు గడుస్తున్నా పునరుద్ధరణ పనులు కనిపించడం లేదు. పంపుహౌజ్తో పాటు సాగర్‌లో మునిగిపోయిన సొరంగ మార్గాలు ఎప్పుడు తెరుచుకుంటాయనేది అంతుచిక్కడంలేదు. ప్రభుత్వం ఐదుగురు ఇంజినీర్లపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంది. కానీ ఇప్పటివరకు నిర్మాణ సంస్థ మేఘా కంపెనీపై చర్యలు తీసుకోలేదు.
హైదరాబాద్ తాగునీటి కోసం కృష్ణా జలాలను సేకరించే ఏఎమ్మార్ ప్రాజెక్టులోని సిస్టర్న్, లింక్‌కెనాల్ శాశ్వత మరమ్మతులను ఈ వేసవిలోనే పూర్తి చేయాలంటూ నీటిపారుదలశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. సిస్టర్న్‌కు గండిపడినట్లయితే ప్రాజెక్టు పంపుహౌజ్ జలదిగ్బంధమవుతుందని లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు. వాస్తవానికి సిస్టర్న్ లీకేజీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగిన రోజుల వ్యవధిలోనే చోటుచేసుకుంది. అప్పట్లో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నిపుణులతో సంప్రదించి గ్రౌటింగ్ పనులు చేపట్టి లీకేజీలను నియంత్రించారు. కానీ ఏనాడూ నెలల తరబడి నీటి సరఫరాను నిలిపివేయలేదు. ఈ దఫా మూడు నెలల పాటు నీటి సరఫరా నిలిపివేయాలని ఈఎన్సీ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టంగండి నుంచి జలమండలి కొత్త పైప్‌లైన్ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
ఏఎమ్మార్ ప్రాజెక్టులో ప్రస్తుతం 18 మెగావాట్ల సామర్థ్యం గల 4 మోటార్లు ఉన్నాయి. ఒక్కో మోటారు నుంచి 600 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోస్తారు. ఐదో మోటారు ఏర్పాటుకు సివిల్ పనులు గతంలోనే పూర్తి చేశారు. నాగార్జునసాగర్ నుంచి ఈ మోటార్ల ద్వారా నీటిని వంద మీటర్ల ఎత్తులోని సిస్టర్న్‌లోకి ఎత్తిపోస్తారు. హైదరాబాద్ తాగునీటి కోసం ఏర్పాటు చేయాల్సిన ఐదో మోటారు అనేది సిస్టర్న్‌లోకి నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఉండదు. నేరుగా అక్కంపల్లి రిజర్వాయర్కుగానీ, జలమండలికి చెందిన కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రానికిగానీ పైప్‌లైన్ ద్వారా నీటిని ఎత్తిపోయాలి.
అంటే ఇప్పుడు ఐదో మోటారు ద్వారా లిఫ్టు చేసే నీళ్లు ఈ వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో పాటు దాదాపు పది కిలోమీటర్ల దూరం కూడా పోవాల్సి ఉంటుంది. ఇందుకు సాధారణంగా నీటిని తరలించే పైప్‌లైన్ కాకుండా పది కిలోమీటర్ల మేర 600 క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యంతో ప్రెషర్ మెయిన్స్ (సాధారణ పైప్లైన్ల కంటే అధిక వ్యయం) వేయాల్సి ఉంటుందని రిటైర్డ్ ఇంజినీర్ ఒకరు తెలిపారు. లిఫ్టు సామర్థ్యం పెరగడంతో పాటు పది కిలోమీటర్ల దూరం నీటిని తరలించాల్సి ఉన్నందున మోటారు సామర్థ్యం ఇప్పుడున్న 18 మెగావాట్లు కాకుండా ఎక్కువగా ఉండాల్సిందేనని చెబుతున్నారు.
రెండు కోణాలను పరిగణలోనికి తీసుకుంటే కేవలం పంపు, మోటార్లకే రూ.500 కోట్లకు పైగా వ్యయం అవుతుందని, పైప్‌లైన్, సివిల్, ఇతరత్రా పనులను కలుపుకుంటే వ్యయం రూ.వెయ్యి కోట్లపైనే ఉంటుందని వివరించారు. ప్రస్తుతం అధికారులు అంచనాలు రూపొందిస్తున్నందున వాస్తవ వ్యయం ఎంత అనేది తేలాల్సి ఉంది. ఈ తాత్కాలిక ప్రత్యామ్నాయం సాగర్‌లో 510 అడుగులకు మించి నీటిమట్టం ఉంటేనే పని చేస్తుంది. లేకుంటే మోటార్ల డిశ్చార్జి తగ్గిపోతుంది.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సుంకిశాల పథకం అంచనా వ్యయం రూ.2215 కోట్లు. ఇప్పటికే దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.700 కోట్లు వరకు ఖర్చు చేస్తే నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజీ నుంచి కూడా హైదరాబాద్‌కు తాగునీటిని అందించే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కానీ తాత్కాలిక పరిష్కారంగా 1000 కోట్లకు పైగా వెచ్చించి కొత్త పైప్‌లైన్ వేస్తే సుంకిశాల భవితవ్యమేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుంకిశాల పూర్తయిన తర్వాత రెండింట్లో ఒకే మార్గం ద్వారా మాత్రమే నీటిని సేకరించేందుకు అవకాశం ఉంటుంది. మరో పథకం నిరుపయోగంగా ఉండాల్సిందేనని సీనియర్ ఇంజినీర్ ఒకరు అభిప్రాయపడ్డారు.