నంగునూరు, 31 మార్చి : ఏప్రిల్ నెలలో 57 ఏండ్లు నిండి అర్హులైన వారందరికి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొత్తగా ఇచ్చే పెన్షన్లను మే 1 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే నిమిత్తం గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..వచ్చే వారం రోజుల్లోగా అభయ హస్తం లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం మిత్తితో సహా చెల్లించనుందని మంత్రి తెలిపారు. అలాగే ఉగాది పండుగ తర్వాత సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు మూడు కిస్తీల కింద ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.