హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త జోన్లు, మల్టీజోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటుకు ఉద్దేశించిన జీవో-317పై ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశమైంది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ జీవో కింద దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు మరికొన్ని ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 14 నుంచి 30 వరకు అవకాశం కల్పించాలని నిర్ణయించా రు. స్థానికత అంశం కీలకంగా మారిన నేపథ్యంలో దరఖాస్తులకు ‘లోకల్ స్టేటస్’ ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ఉద్యోగులకు (భార్య లేదా భర్త) కూడా అప్షన్ కల్పించారు. మల్టిపుల్ దరఖాస్తులకు సబ్‌కమిటీ అవకాశం కల్పించింది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగులకు రసీదు ఇవ్వడమే కాకుండా సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపనున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా 12,011 దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని కూడా క్యాబ్‌నెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు.