Liquor Brand | రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నియంత్రిత మద్యం మార్కెట్లో ప్రభుత్వం కొత్త బ్రాండ్ల ప్రవేశానికి అనుమతులు జారీ చేస్తున్నది. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. మొదట నూతన బ్రాండల్లకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 15 వరకు గడువు ఇవ్వగా.. తాజాగా గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ ప్రకటన విడుదల చేశారు.
ఇక రాష్ట్రంలో తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకునేందుకు వీలుగా.. టీజీబీసీఎల్‌కు 39 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. టీజీబీసీఎల్‌లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా.. మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవనే నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తుతో జత పరచాలని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది. టీజీబీసీఎల్ కోరిన విధంగా సర్టిఫికెట్లను జతచేయడంలో కొంత ఆలస్యం జరుగుతుందని.. ఈ క్రమంలో దరఖాస్తు గడువును పెంచాలని పలు కంపెనీలు కోరాయి. ఈ క్రమంలో దరఖాస్తు గడువును ఏప్రిల్ 2 వరకు పెంచినట్లు హరి కిరణ్ పేర్కొన్నారు.