హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గంజాయి, గుడుంబా, ఇతర మత్తుపదార్థాల ఉత్పత్తుల, అమ్మకాల స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినప్పటికీ, ఇప్పుడు మరో రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికీ, ఇతర రాష్ర్టాల నుంచి గంజాయి, వైట్నర్ మాఫియా సాగిస్తున్న దందా సమస్యాత్మకంగా మారుతున్నది. దీంతోపాటు మెడికల్ దుకాణాల్లో తేలికగా లభించే వివిధ రకాల దగ్గు, నొప్పి నివారణ మందులకు యువత బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను రాష్ట్ర పోలీసులు నిర్మూలించడంతో వాటికి బానిసైనవారు మత్తునిచ్చే ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నాయి. మెడికల్ దుకాణాల్లో చట్టబద్దంగా దొరికే దగ్గు మందులు, నొప్పి నివారణ మందులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వీటిని అతిగా వాడటం ఆరోగ్యానికి హానికరమని తెలిసీ అలవాటుపడుతున్నారు. మత్తుబాబులు ప్రధానంగా ఓపైడ్ డ్రగ్స్ (నొప్పి నివారణ), సెడెటివ్ డ్రగ్స్ (మత్తునిచ్చి నిద్రపుచ్చేవి) ఎక్కువగా వాడుతున్నట్టు పోలీసుల పరిశీలనలో తేలింది. ఇటీవల నల్లగొండలో కొందరు యువకులు ‘ట్రెమడాల్’ అనే నొప్పి నివారణ ట్యాబ్లెట్లను వాడుతున్నట్టు బయటపడింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నైట్రోవెట్ ట్యాబ్లెట్లను ఒక్కో షీట్ రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించి కొనుగోలు చేసి మత్తు కోసం వాడినట్టు ఈ నెల 12న పోలీసులు గుర్తించారు. మరికొందరు టెర్మైన్ ఇంజెక్షన్లు, కిటోమిన్ వర్గానికి చెందిన మందులు, ఇతర దగ్గుమందులు వాడుతున్నారు. వైట్నర్ను చేతి రుమాలులో పోసి వాసన పీల్చడం ద్వారా కొందరు మత్తులో జోగుతున్నారు.
పొరుగు రాష్ర్టాల నెట్‌వర్క్‌పై గురి!
రాష్ట్రంలో గంజాయి, గుడుంబా స్థావరాలు, డ్రగ్స్ నెట్‌వర్క్‌లు నిర్వీర్యమైన నేపథ్యంలో మన రాష్ట్రం మీదుగా జరుగుతున్న అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గంజాయి, గుట్కా, వైట్నర్ తదితరాల అక్రమ రవాణా చేస్తూ ఇటీవల పలువురు పట్టుబడ్డారు. గుట్కా, వైట్నర్ విక్రేతలపైనా పీడీయాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గత ఐదు నెలల్లో 77 మందిపై పీడీయాక్ట్ నమోదు చేయగా, వీరిలో 22 మంది గుట్కా, వైట్నర్, గంజాయి విక్రేతలు ఉన్నారు. పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు నిత్యం దాడులుచేస్తూ రాష్ట్రం గుండా రవాణా అవుతున్న వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొంటున్నారు. రాష్ట్రంలోని నారాయణఖేడ్ ప్రాంతంలో గంజాయి సాగు పూర్తిగా కనుమరుగైంది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయి మన రాష్ట్రం మీదుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలకు రవాణా అవుతున్నది. ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా తరలిస్తున్న ఈ గంజాయి ముఠాలకు పోలీస్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు.
కేంద్రం వైఖరితో చిక్కులు
యూఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్ సభ్య దేశాల సమావేశంలో గంజాయిపై నిషేధం ఎత్తివేయాలని కోరిన 27 దేశాల్లో భారత్ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గంజాయిపై నిషేధం ఎత్తివేత దిశగా అడుగులు వేస్తున్నదని సమాచారం. గోవాలో గంజాయి సాగుకు ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ గతేడాది అనుమతి ఇచ్చింది.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
మత్తుకోసం తరుచూ దగ్గుమందు, వైట్నర్ ఇతర కిటోమిన్ మందులు వాడటం వల్ల కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. పిచ్చిగా మాట్లాడే లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంలో ఇతర కీలక అవయవాలు దెబ్బతింటాయి. రోగాలు వచ్చినప్పుడు మోతాదుకు మించి మందులు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడ తాయి. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మెడికల్ దుకాణాల నిర్వాహకులు వీటిని ఇవ్వడం కూడా నేరమే.
-డాక్టర్ కిరణ్ మాదాల, అనస్థీషియా, క్రిటికల్‌కేర్ హెడ్, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన
దేశంలో వయస్సులవారీగా ఒపైడ్ (నార్కోటిక్స్ డ్రగ్స్- నొప్పి నివారణి), సెడెటివ్స్ (మత్తు మందులు) వాడేవారి శాతాలు
వయస్సు (ఏండ్లు) ఒపైడ్ సెడెటివ్స్
10-17 1.8% 1.58%
18-75 2.1% 1.21%