హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు. తాజాగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా మరో రూ.7,045 కోట్ల మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు పర్యాటక శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. మూడు నెలల క్రితం చేసుకున్న ఒప్పందాలకే ఇంతవరకు అతీగతీ లేదు.. కొత్తగా చేసుకున్న ఎంవోయూలతో ఏం సాధిస్తారోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో టూరిజం పాలసీతో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. టూరిజం కాంక్లేవ్ సందర్భంగా పర్యాటక రంగంలో మొత్తం 30 రకాల ప్రాజెక్టులతో రూ.15,279 కోట్ల మేరకు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. వీటి వల్ల ప్రత్యక్షంగా 19,520 మందికి, పరోక్షంగా మరో 50వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని మూడు నెలల క్రితం శిల్పారామం వేదికగా జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో గొప్పలు చెప్పారు. ఇప్పటివరకు వాటిలో ఒక్క ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలపై చూపుతున్న శ్రద్ధ వాటి అమలుపై చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలపై పీపీపీ విధానంలో, ప్రైవేటు వాళ్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. కానీ, ఆ తర్వాత జరగాల్సిన పనులపై దృష్టి పెట్టడం లేదు. ప్రాజెక్టులకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయడం లేదు. ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయోనన్న దానిపై క్లారిటీ లేదంటూ పరిశీలకులు విమర్శిస్తున్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు విస్మయం గొలుపుతున్నాయి. గతంలో ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలతోనే మళ్లీ కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నది. పాత ఒప్పందం ఒక్క అడుగు కూడా ముందుకు పడకముందే మరో కొత్త ఒప్పందం తెరపైకి వచ్చింది. రిధిర గ్రూప్‌తో చేసుకున్న రెండు ఒప్పందాలే ఇందుకు నిదర్శనం. గత సెప్టెంబర్‌లో టూరిజం కాన్క్లేవ్లో భాగంగా ఇదే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. రంగారెడ్డిజిల్లా శంకర్పల్లి సమీపంలో రిధిర జెన్ పేరుతో ఫైవ్‌స్టార్ బ్రాండెడ్ రిసార్ట్ నిర్మాణానికి ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో ఆరు ఎకరాల్లో వెయ్యి చదరపు ఫీట్ల రిసార్ట్‌ను నిర్మిస్తామన్నది. కట్ చేస్తే అక్టోబర్, నవంబర్ రెండు మాసాలు మాత్రమే గడిచాయి. తాజాగా మంగళవారం ఇదే సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో యాచారంలో రూ.120 కోట్లతో నోవాటెల్ బ్రాండెడ్ హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ఎంవోయూను కుదుర్చుకుంది. రెండు నెలల క్రితం చేసుకున్న ఒప్పందానికే దిక్కు లేకపోగా, మళ్లీ అదే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.