సంగారెడ్డి, జూన్ 28 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్ కొంతకాలంగా విద్యార్థుల కోసం సరికొత్త కోర్సులను ప్రకటిస్తూ వస్తున్నది. తాజాగా ఫ్యూచర్ వైర్లెస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సును మంగళవారం ప్రవేశపెట్టింది. 12 నెలల ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ తరగతులు ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభించనున్నారు. ఎంపికైన 250 మంది విద్యార్థులకు ప్రతినెలా రూ.25 వేల చొప్పున స్కాలర్షిప్ అందజేయనున్నారు.
డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. బీటెక్‌లో 8వ సెమిస్టర్ చదువుతున్న వారు కూడా అర్హులే. కోర్సు పూర్తి చేసిన వారికి కంపెనీ ప్లేస్మెంట్తోపాటు ఐఐటీ హైదరాబాద్‌లో జరిగే పరిశోధనల్లో అవకాశం కల్పిస్తారు. కొత్త కోర్సులో చేరేందుకు ఆసక్తిగల విద్యార్థులు జూలై 10 నుంచి fwc.iith.ac.in వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లేదా ఐఐటీ హైదరాబాద్‌లోని అకాడమీ ఏ బ్లాక్‌లో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉన్నది. 5జీ సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్ ఫ్యూచర్ వైర్లెస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సును కొత్తగా ప్రారంభిస్తున్నది.
త్వరలో 5జీ సేవలు: కేంద్ర మంత్రి
ఐఐటీ హైదరాబాద్ ఏటా 500 మంది ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలన్న సంకల్పంతో ఫ్యూచర్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోర్సును ప్రారంభించటం పట్ల కేంద్ర కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ కోర్సు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన వెబినార్ ద్వారా మాట్లాడారు. దేశాన్ని డిజిటల్ వైపు మళ్లించేందుకు ఇలాంటి కోర్సులు ఉపయోగపడతాయని తెలిపారు. కేంద్రం 5జీ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. 5జీపై ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన పరిశోధనలు ఫలవంతమైనట్టు తెలిపారు. 5జీ కోసం అభివృద్ధి చేసిన నూతన సాంకేతికను గ్రాడ్యుయేట్లకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఫ్యూచర్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోర్సును ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యూచర్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోర్సు కోఆర్డినేటర్ ప్రొఫెసర్, డాక్టర్ జీవీవీ శర్మ, ఐఐటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.