హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖ ద్వారా వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విభాగానికి వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్త ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొమ్మిది నెలలుగా పట్టించుకోవడం లేదు.
ఏడాదికి రూ. 200 కోట్లకు పైగా ఆదాయం ఉన్న ఎక్సైజ్ పోలీసుస్టేషన్లలో నిర్వహణ ఇబ్బందిగా ఉందని క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని రెండు స్టేషన్లుగా విభజించాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2022 ఆగస్టులో ఉత్తర్వులు జారీచేసింది. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 13 ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేయవచ్చని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నివేదికలు రూపొందించింది.
ఇందుకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. శేరిలింగంపల్లి, బాలానగర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఘట్కేసర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, శంషాబాద్, పటాన్చెరు, సికింద్రాబాద్, హన్మకొండ ఎక్సైజ్ పోలీసు స్టేషన్లను రెండుగా విభజించాలని సూచిస్తూ కమిషనర్ కార్యాలయం నివేదికలు సిద్ధం చేసింది. ఆ నివేదికను 2023 డిసెంబర్లో ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. ఈ లోగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఫైల్ అటకెక్కింది.
కొత్త ఎక్సైజ్ పోలీసుస్టేషన్లకు అనుమతించి ఉంటే.. ప్రతి స్టేషన్‌కు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కనీసం 10 మంది కానిస్టేబుళ్లు మొత్తం 15 మందికి, 14 స్టేషన్లలో కలిపి కనీసం 210 మంది నిరద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేవి. సర్వీస్‌లో ఉన్న వారికి పదోన్నతులు వచ్చేవి. ఉద్యోగ బదిలీలు జరిగేవి.
ఒక్క సంతకంతో పూర్తయ్యే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా తొక్కి పెడుతున్నది. కొత్త ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న ఏకైక కారణంతోనే ఫైల్‌ను పక్కన పెట్టారని ఎక్సైజ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త పోలీసుస్టేషన్లను ఏర్పాటుచేసి పని భారాన్ని తగ్గించటంతోపాటు, పదోన్నతులు, బదిలీలకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు. దీనిపై ఎక్సైజ్ కమిషనర్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.