హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): కార్మిక సంక్షేమం కోసం వివిధ పద్దుల కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.140 కోట్ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కేంద్రమంత్రులకు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో కార్మికుల సంఖ్య పెరుగుతున్నదని, కొత్తగా ఈఎస్ఐ దవాఖానలను మంజూరుచేయాలని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. నాచారంలో 350 బెడ్ల ఈఎస్ఐ దవాఖాన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు వెంటనే నిధులు విడుదల చేయాలని భూపేంద్రయాదవ్‌ను కోరారు. నిర్మాణంలో జాప్యం వల్ల కరోనా సమయంలో దాదాపు 17 లక్షల మంది ఈఐఎస్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దవాఖానకు అనుబంధంగా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి నిధులివ్వాలని, అవసరమైన సాంకేతిక సహకారం కూడా అందించాలని విజ్ఞప్తిచేశారు. తమ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.