మేడ్చల్, మే8 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ నైపుణ్యాలతో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రముఖ సంస్థ ‘ఇరోస్ ఏఐ విద్య’తో కలిసి క్రియేటివ్ మీడియా ఏఐ ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ వీఎఫ్ఎక్స్ గేమింగ్ వంటి రంగాల్లో సరికొత్త ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభించింది. ఈ సందర్భంగా వర్సిటీ చైర్మన్ భద్రారెడ్డి మాట్లాడుతూ.. చదువు, పరిశ్రమ అవసరాలకు మధ్య దూరాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు నిపుణుల పర్యవేక్షణలో రియల్ టైమ్ ప్రాజెక్ట్లు, అడ్వాన్స్డ్ స్టూడియోల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సినిమా మేకింగ్, యూనిమేషన్ పద్ధతులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. కార్యక్రమంలో ఇరోస్ సీఈవో ప్రశాంత్ పండిత్, చాన్స్లర్ సుధారమణ, వైస్ చాన్స్లర్ అనిల్కౌల్ పాల్గొన్నారు.