Telangana | హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అందజేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా 1,061 మంది వైద్యులకు నియామక పత్రాలను హరీశ్‌రావు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యకరమంలో డీఎంఈ రమేశ్ రెడ్డి, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
కొత్తగా నియామకమైన వారంతా డీఎంఈ పరిధిలోనే పని చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేస్తున్నది. ఆయా కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వైద్యశాఖ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టింది. దీంతో మెడికల్ కాలేజీలకు సిబ్బంది సమకూరారు. వీరికి అదనంగా ఇప్పుడు మరో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేరనున్నారు. ఈ నియామకాలతో రాష్ట్రంలో వైద్యవిద్య మరింత బలోపేతం కానున్నది.
ఐదు నెలల్లోనే నియామకాలు
నోటిఫికేషన్ విడుదల చేసిన ఐదు నెలల్లోనే వై ద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. 1,147 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ 6న నోటిఫికేషన్ ఇచ్చింది. 34 విభాగాల్లో ఈ ఖాళీలను ప్రకటించింది. ఇందులో మల్టీ జోన్-1లో 574 పోస్టులు, మల్టీ జోన్-2లో 573 పోస్టు లున్నాయి. డిసెంబర్ 20 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 2 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. 20న రోస్టర్ జాబితాను ప్రకటించారు. మార్చి 28న ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసి అ భ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన వాటిని పరిశీలించి, 8న తుది జాబితాను విడుదల చేశారు. వీరిలో 1,061 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించారు.