హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి30 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ విద్యార్థుల అక్రమ అరెస్టులను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఖండించారు. రేవంత్ సర్కారుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘చరిత్రలో భూములు గుంజుకున్నోడు ఎవడూ గెలవలేదు, భూముల కోసం కొట్లాడినోడే గెలిచాడు. హైడ్రా, మూసి, లగచర్లలో చేదు అనుభవాలు ఎదురైనా కూడా హెచ్‌సీయూ భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే.. అసలు మీకు కొంచెం కూడా సిగ్గులేదు. ఇందులో కూడా మీరు ఓటమినే చూస్తారు’ అంటూ బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు.
‘ 2016లో నిలబడ్డతీరుగా రాహుల్‌గాంధీ నేడు హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తారా? మౌనంగా ఉంటారా?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ‘విద్యార్థులపై ఎలాంటి ఆదేశాలు లేకుండా పోలీసులు లాఠీచార్జి చేయడం గుండాగిరీని తలపిస్తున్నది’ అంటూ జర్నలిస్టు రేవతి పోస్టు చేశారు. ‘ఉగాది రోజు హెచ్‌సీయూ విద్యార్థులకు రేవంత్ ఇచ్చిన బహుమతి ఇది.
భూములను వేలం వేయొద్దని, 400ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలన్నందుకు విద్యార్థులపైన పోలీసుల జులూం’ అంటూ బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. వీరితోపాటు విద్యార్థుల అరెస్టులను ఖండిస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థి సంఘాల నేతలు, మేధావులు రేవంత్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.