హైదరాబాద్, జనవరి 14: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో గతంలో పత్రికా స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ నెటిజన్లు కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తున్నారు. రాహుల్ గతంలో పత్రికా స్వేచ్ఛ గురించి ఏమన్నారంటే..
‘భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు పెను ముప్పు ఏర్పడింది. ఇది యావత్ ప్రపంచానికి కనపడుతున్నది. ప్రజాస్వామ్యం సక్రమంగా నడవాలంటే పత్రికా స్వేచ్ఛ చాలా కీలకం. విమర్శలను ఎదుర్కొనేందుకు పాలకులు సిద్ధంగా ఉండాలి. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది’
-2023 జూన్‌లో వాషింగ్టన్‌లోని జాతీయ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలివి.
‘ఆరోగ్యకరమైన, ప్రభావవంతమైన ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన పత్రికా వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.మీడియాను పరిపుష్టం చేసి, పత్రికాస్వేచ్ఛను పరిరక్షించి, ప్రజల గొంతును వినిపిస్తూ పాలకులకు వాస్తవాలను తెలియచెప్పే హక్కును సమర్థించాలి.’
-2025 మే 1న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మీడియా సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ రాహుల్ అన్న మాటలివి.
‘శక్తివంతమైన ప్రజాస్వామ్యం ధైర్యం, సత్యం, స్వతంత్ర జర్నలిజంపై ఆధారపడి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛను, పౌరులు తెలుసుకునే హక్కును కాంగ్రెస్ ఎల్లప్పుడూ సమర్థించింది’
-2026 నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటన ఇది..