హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : సీఎం ఇలాకా.. మిట్ట మధ్యాహ్నం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సినిమాను తలపించేలా 34మంది.. వారిలో వారే దాడి చేసుకుంటున్నట్టు డ్రామా ఆడారు. ఆ తర్వాత బాధితులు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీ కొట్టింది. ఇదేంటని ప్రశ్నించేందుకు కారు దిగిన రాంబాబు అనే వ్యక్తిని… కొట్టుకుంటూ మరో కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత వారు ముందుగా ఎంచుకున్న ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లారు. కొడుతున్న వీడియోలు చూపించడంతో భయపడిన రాంబాబు తల్లి.. వారు అడిగిన సంతకాలు పెడతానని చెప్పింది. వెంటనే స్థానిక ఎమ్మార్వో ఎక్కడున్నారో కనుక్కొని, మరో కారులో ఆమెను ఆయన దగ్గరకు తీసుకెళ్లి.. 3 ఎకరాల భూమికి సంబంధించి సంతకాలు చేయించారు. ఆ ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లిన రాంబాబును.. రాఘవేందర్‌రాజు కారు డ్రైవర్ ‘నువ్ ఎక్కడికి వెళ్లినా.. నిన్ను చంపేస్తా’ అని బెదిరించాడు. ‘ఆ భూమి మాదే.. నువ్ ఎవ్వరి దగ్గరికి వెళ్లినా నిన్ను పట్టించుకునే దిక్కు ఉండదు. మా వెనుక సీఎం ఉన్నడు’ అంటూ విచక్షణరహితంగా కొట్టినట్టు బాధితులు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా.. అనుముల సోదరుల రాజ్యాంగమే నడుస్తున్నదని, పోలీసులు సైతం అందుకు కట్టుబడి బాధితుల పక్షాన కాకుండా.. నిందితుల పక్షాన నిలబడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ కేసు నేపథ్యం..!
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పాలాది చంద్రమౌలీశ్వర్.. మహబూబ్‌నగర్ జిల్లా పాల్కొండ గ్రామ శివారులో సర్వే నంబర్ 272/1లో 7ఎకరాల 30 గుంటల భూమిని 1988లో కొనుగోలు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత భార్య పాలాది కళావతి, కుమారులు శ్రీనివాస్, రాంబాబు 2023లో జడ్చర్లకు చెందిన శివలింగం అనే వ్యక్తికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2024 మే 8న వారికి ఆ భూమిలో 51 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ అగ్రిమెంట్లో కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి సోదరులకు దగ్గరిగా ఉండే రాఘవేందర్‌రాజు పేరును శివలింగం చేర్చారు. కాగా రాఘవేందర్ రాజు ఎవరో వారికి తెలియదు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం 50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 30 లక్షలు మాత్రమే ఇచ్చి.. మొత్తం ఇచ్చినట్టు ఫొటోలు, వీడియోలు తీసి, వారికి ఆ 7 ఎకరాల 30 గుంటల్లో మిగిలిన 3 ఎకరాల భూమిని కూడా తమకే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో నిరుడు మే నెలలో పోలీసులే వారిని హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి మహబూబ్‌నగర్ తీసుకెళ్లి, స్టేషన్లో విచక్షణరహితంగా కొట్టి, బలవంతంగా సంతకాలు చేయించారని తెలుస్తున్నది. అనంతరం బాధితులు మానవహక్కుల కమిషన్‌కు వెళ్లారు. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ‘సీఎం సోదరుల పేరుతో బెదిరింపు’ అనే శీర్షికతో కథనం రాసింది. దీంతో అప్పటికి వెనక్కి తగ్గిన కబ్జాదారులు.. మళ్లీ సోమవారం వారిని బలవంతంగా మహబూబ్‌నగర్ తీసుకెళ్లి, చితక్కొట్టి పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో మహబూబ్‌నగర్ స్టేషన్ మెట్లు ఎక్కినా పోలీసులు కేసు తీసుకోలేదు. దీంతో మహబూబ్‌నగర్ నుంచి బతుకుజీవుడా అంటూ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కేసు తీసుకొమ్మని చెప్పడంతో.. వారు కూడా కేసును తీసుకోలేదని సమాచారం. ఎక్కడ ఘటన జరిగిందో అక్కడికే వెళ్లాలంటూ సలహా ఇచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పినా కూడా కేసు తీసుకోకపోవడంతో బాధితులు డయల్ 100కు కాల్ చేశారు. అన్యాయం జరిగిందని, దాడి జరిగిందని ఆశ్రయించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.