హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ర్టానికి చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ ఆలిండియా ఓపెన్ కోటా 18వ ర్యాంకు, షణ్ముఖ నిశాంత్ అక్షింతల 37వ ర్యాంకు, మంగారి వరుణ్ 46వ ర్యాంకు, వై షణ్ముఖ్ 48వ ర్యాంకు, బిదిశ మాజీ 95వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. టాప్-100 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన వారు ఐదుగురు మాత్రమే ఉన్నారు. కాకర్ల జీవన్ సాయికుమార్ ఆలిండియా 18వ ర్యాంకుతో పాటు తెలంగాణ టాపర్‌గాను నిలిచాడు. ఈ సారి తెలంగాణ నుంచి 72వేలకు పైగా విద్యార్థులు నీట్ (యూజీ) పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 70వేల మంది హాజరయ్యారు. 41వేలకుపైగా విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
నీట్ ఫలితాల్లో ఈసారి తెలంగాణ విద్యార్థులు వెనుకబడ్డారు. ఏటా ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులుండేవారు. కానీ ఈ ఏడాది టాప్-10లో ఒక్కరు కూడా లేరు. టాప్-20లో ఒకే ఒక్క విద్యార్థి చోటు దక్కించుకున్నారు. క్యాటగిరి ర్యాంకుల్లోనూ తెలంగాణ విద్యార్థులు వెనుకబడ్డారు. మహిళా టాపర్లల్లో బిదిశ మాజీ 13, రేండ్ల బ్రాహ్మిణి 17వ ర్యాంకును సాధించారు. ఓబీసీ (ఎన్సీఎల్) క్యాటగిరిలో మంగారి వరుణ్ ఆలిండియా 10వ ర్యాంకు, ఎస్సీ క్యాటగిరిలో రెడ్డిమల్ల శ్రీశాంత్ మూడో ర్యాంకు, ఎస్టీ క్యాటగిరిలో పూజారి హాసిని 3వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.
నీట్-యూజీ ప్రశ్నలు ఈ సారి కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫిజిక్స్ ప్రశ్నలు విద్యార్థులను దెబ్బతీశాయి. దీంతో టాపర్లు కూడా 100 పర్సంటైల్ మార్కులను కైవసం చేసుకోలేకపోయారు. ఫిజిక్స్‌లో 45 ప్రశ్నలివ్వగా, చాలా మంది విద్యార్థులు 25-30 ప్రశ్నలతోనే అగిపోయారు. మిగతా ప్రశ్నలకు ఆన్సర్లు చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గతంలో చాలాసార్లు ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నలే కఠినంగా ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. కానీ ఈ సారి అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఫిజిక్స్ ప్రశ్న లు అత్యంత కఠినంగా ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు.
నీట్లో ప్రశ్నలు పొడవుగా కఠినంగా వచ్చాయి. ఆన్సర్లు రాసేందుకు చాలా సమయం పట్టింది. మొదట్లో మంచి ర్యాంకు వస్తుందన్న ఆశించలేదు. కానీ ఆలిండియా 37వ ర్యాంకు రావడం సంతోషానిచ్చింది. ఎయిమ్స్ ఢిల్లీలో చేరుతా. నా సోదరుడు మెడికోగా ఉన్నారు. నీట్ కోసం ఉదయం 8: 30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు చదివేవాడిని. ఆటలాడేందుకు గంట విరామం తీసుకునేవాడిని. టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవాడిని. యూట్యూబ్‌లో పాటలు వింటూ ఒత్తిడిని దూరంచేసుకున్నా.
-షణ్ముఖ నిశాంత్ అక్షింతల
నా చిన్నతనంలోనే అమ్మమ్మ క్యాన్సర్‌తో చనిపోయారు. అమ్మమ్మను బతికించుకోలేకపోయామన్న క్షోభ నన్ను వెంటాడింది. మా ఇంట్లో డాక్టర్లు లేరు. అప్పుడే డాక్టర్ కావాలని బలమైన నిర్ణయం తీసుకున్నా. ఇంటర్ హైదరాబాద్‌లో చదివా. నీట్లో 670 మార్కులొచ్చాయి. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు చెస్ ఆడేవాడిని. ఎయిమ్స్‌లోనే ఎంబీబీఎస్ కోర్సులో చేరుతా.
-జీవన్ సాయికుమార్
మెడిసిన్ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. నీట్ కోసం చాలా కష్టపడ్డా. మంచి ర్యాంకు రావడం సంతోషానిచ్చింది. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరుతా.
-షణ్ముణ్