హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ పరీక్ష ఆదివారం జరుగనున్నది. రాష్ట్రంలో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా 72,507 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈసారి మూడంచెల భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు వెల్లడించారు. శుక్రవారం సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సీఎస్‌తో కలిసి నీట్, భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రాసే విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అనుమతించనున్నట్టు తెలిపారు. మధ్యా హ్నం 2 నుంచి సాయం త్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు.
6న అనురాగ్ వర్సిటీ ప్రవేశపరీక్ష
పోచారం,మే 2: పోచారం మున్సిపాలిటీ వెంకటాపురంలోని అనురాగ్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఈనెల 6న నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల11న యూనివర్సిటీలో స్కాలర్షిప్ పరీక్ష ఉదయం 10గంటలకు ఉంటుందని వివరించారు. పరీక్షలో 1నుంచి 10వరకు ర్యాంకులు సాధించిన వారికి 100% స్కాలర్షిప్ ఇవ్వనున్నారు.