నీట్లో మంచి ర్యాంకు సాధించిన కరిష్మా
ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు
డాక్టర్ చదువుకు పేదరికం శాపం
దాతలు సాయమందించాలని వేడుకోలు
కౌటాల, ఫిబ్రవరి 12: నీట్లో మంచి మార్కు లు తెచ్చుకొని ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆ యువతికి పేదరికం శాపంగా మారిం ది. చదువుకొనే స్థోమత లేక దాతలసాయం కోసం ఎదురుచూస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరికి చెందిన చాహరే జనార్దన్-రేఖ దంపతులకు కొడుకు సచిన్, కూతు ళ్లు దీక్ష, కరిష్మా ఉన్నారు. తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకొంటూనే కూలీకి వెళ్తుంటారు. 2019లో జనార్దన్ గుండె సంబంధిత వ్యాధితో మంచంపట్టాడు. 4 లక్షల వరకు అప్పు చేసి ఆపరేషన్ చేయించుకొన్నాడు. భార్య రేఖ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది.
దాతలకోసం ఎదురుచూపు..
కరిష్మాకు చిన్నతనం నుంచే చదువంటే ఆసక్తి. ఎంబీబీఎస్ చదవాలన్న పట్టుదలతో ప్రభుత్వ సాయంతో హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొన్నది. 2021 సెప్టెంబర్‌లో నీట్ పరీక్ష రాయగా 471 మార్కులు సాధించింది. ప్రభుత్వ కోటాలో హైదరాబాద్‌లోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్-రీసెర్చ్‌లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఇందులో చదివేందుకు ఐదేండ్లకు రూ.15 లక్షల ఫీజు కట్టాల్సి ఉన్నది. డాక్టర్ కావాలన్న ఆమె ఆశకు పేదరికం అడ్డురావడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. వివరాలకు చాహరే సంధ్య (కరిష్మాకు పెదనాన్న కూతురు)ను 6303492795 నంబర్లో సంప్రదించాలని కరిష్మా కుటుంబ సభ్యులు కోరుతున్నారు.