హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: నీట్ అక్రమాల పుట్టగా మారిందని ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఐక్య విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీట్ ప్రక్రియలో అక్రమాలు జరిగినా కేంద్రం చేష్టలుడిగి చూస్తున్నదని అన్నారు.
నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని, ఆ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. నీట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తామన్నారు.