ఖైరతాబాద్ /ఉస్మానియా యూనివర్సిటీ / హిమాయత్‌నగర్ జూన్ 12 : నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాలలో అవకతవకలపై సీబీఐచే విచారణ జరిపించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. హరియాణాలోని ఒకే పరీక్ష కేంద్రం నుంచి 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించారని, ఇది అవకతవకలు జరిగిందనడానికి నిదర్శనమని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఝాన్సీ పేర్కొన్నారు. ఈ నెల 14వ ఫలితాలిస్తామని ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు 4నే ఫలితాలను వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని ఏబీవీపీ నేత రాజు తెలిపారు. బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. నీట్ పరీక్ష కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోత్కుమార్సింగ్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య డిమాండ్ చేశారు. పరీక్షలకు తిరిగి మళ్లీ నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ కోరారు.