నీరాకేఫ్.. కల్లు గీత కార్మికుల ఆత్మగౌరవ పతాక. ఎందరో గౌడన్నలు గుండెలు చరుసుకున్న ప్రతిష్ఠ. ఇప్పుడు ఆ ఆత్మగౌరవ పతాకకు తీవ్ర అవమానం జరుగుతున్నది. హైదరాబాద్ నగర నడిబొడ్డులో అత్యంత సుందరంగా కొలువుదీరిన నీరాకేఫ్‌ను అన్యాక్రాంతం చేసేందకు టూరిజం శాఖ కంకణం కట్టుకున్నది. నగరంలోని ఎందరో కిడ్నీరాళ్ల వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నీరా, కేఫ్‌ను పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కేఫ్‌ను ఎత్తివేయాలని త్వరలోనే నిర్వాహకులకు నోటీసులు ఇవ్వనున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
Neera Cafe | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): సుమారు రూ.20 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో ఆధునిక వసతులతో నీరాకేఫ్‌ను గత ప్రభుత్వం నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా నీరా పాలసీని తీసుకొచ్చిన కేసీఆర్.. ఎందరో గీత కార్మికులకు వెన్నుదన్నుగా నిలిచారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు నీరాకేఫ్‌ను గౌడన్నల ఆత్మగౌర పతాకగా తీర్చిదిద్దారు. ఇప్పుడు దానిని ఎక్కడికి తరలిస్తారో తెలియనంత రహస్యంగా తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నీరాకేఫ్‌కు ఆదినుంచీ అండగా ఉన్న ఎక్సైజ్‌శాఖ దాని బాగోగులు పట్టించుకోకపోవడం, కేఫ్ పెత్తనం మొత్తం టూరిజం శాఖకే కట్టబెట్టడంతో వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
కేఫ్‌ను హోటల్‌గా మార్చేందుకు ప్రయత్నాలు
సుందరమైన నీరాకేఫ్‌ను అక్కడినుంచి పూర్తిగా తీసేసి.. దానిని హోటల్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కేఫ్‌లో ఉన్న గ్లాస్ అద్దాలను పూర్తిగా తొలగించారు. హుస్సేన్‌సాగర్ వైపు ఉన్న చెట్లను కొట్టేశారు. నీరాకు, నీరా ఉప ఉత్పత్తులకు ప్రచారం తగ్గించారు. నీరాకేఫ్ నేమ్‌ప్లేట్ పక్కనే ఫుడ్‌కోర్టు బోర్డులు పెట్టి.. నీరాకేఫ్ ప్రాధాన్యాన్ని తగ్గించారు. నగరం నడి గడ్డపై గౌడన్నల కోసం కేసీఆర్ తీర్చిదిద్దిన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు.. కేఫ్‌ను పూర్తిగా అన్యాక్రాంతం చేసేందుకు నిర్వాహకులకు కూడా త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టూరిజం శాఖ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అవి నీరాకేఫ్ నిర్వాహలకు అందితే.. ఏ క్షణమైనా వారిని ఖాళీ చేయించే ఆస్కారం ఉన్నట్టు తెలిసింది. ఒక పథకంలో భాగంగానే నీరాకేఫ్ నేమ్ప్లేట్లు పాడైనా, కేఫ్ పక్కన అపరిశుభ్రంగా ఉన్నా, టూరిజంశాఖ పట్టించుకోవడం లేదని కేఫ్‌ను చూసేందుకు వస్తున్న పర్యాటకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అగ్రకుల వర్గీయులకు హోటల్ నిర్వహణ బాధ్యతలు?
కేవలం గౌడన్నల ఆత్మగౌరవం కోసమే గత ప్రభుత్వం నీరాకేఫ్‌ను నిర్మిస్తే.. ఆ కేఫ్‌ను తీసేసి, హోటల్‌గా మార్చి.. అగ్రకుల సామాజిక వర్గానికి చెందినవారికి ఇచ్చే యోచనలో టూరిజం శాఖ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి ఉన్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని విశ్వసనీయ సమాచారం. గీత కార్మికుల కోసమే నిర్మించిన నీరాకేఫ్‌ను హోటల్‌గా ఎందుకు మార్చుతున్నారో..? ఒక క్రమపద్ధతిలో ఫుడ్‌కోర్టుగా మార్చి.. హోటల్‌గా రూపొందిచాల్సిన అవసరం ఎందుకొచ్చిందో..? దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో..? త్వరలోనే ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టనున్నది. గతంలో ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ నాటి సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు కేఫ్ నిర్మాణం, ప్రారంభోత్సవం, ఆ తర్వాత జరిగిన కేఫ్ ప్రమోషన్ల వరకూ అన్నీ ఆయనే భుజాన వేసుకున్నారు. ‘నీరాకు బ్రాండ్ అంబాసిడర్’గా శ్రీనివాస్‌గౌడ్ మారారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలవుతున్నా.. ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు నీరాకేఫ్ వైపు కన్నెత్తి చూడలేదు.