శేరిలింగంపల్లి, డిసెంబర్ 29: గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) డైరెక్టర్ శేరి చిన్నంరెడ్డి రూ.13 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తన వ్యవహారశైలితో సంస్థను మూతపడే స్థితికి తీసుకొచ్చిన ఆయనను బర్తరఫ్ చేయాలని, న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో మీడియాతో వారు మాట్లాడుతూ.. 2016లో నిథమ్‌కు కొత్త డైరెక్టర్‌గా నియమితులైన చిన్నంరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఏ వర్సిటీ వీసీకి లేనంత వేతనం అందుకుంటున్నారని, నెలకు రూ.3.30 లక్షల వేతనంతోపాటు అలవెన్సు కింద మరో లక్ష తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నిథమ్ వెనకబడిపోయిందని.. ఒకప్పుడు 950 మంది విద్యార్థులు ఉండగా, నేడు ఆ సంఖ్య 250కి పడిపోయిందని తెలిపారు. నిథమ్ లో మొత్తంగా రూ.50కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాగ్ సైతం రూ.13కోట్ల అక్రమాలు జరిగినట్టు నివేదికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. చిన్నంరెడ్డి అక్రమాలపై పర్యాటకశాఖ మంత్రి, కార్యదర్శికి ఇటీవల ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో నిథిమ్ రిజిస్ట్రార్ శ్రీధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేందర్‌రెడ్డి, డాక్టర్ కిరణ్మయి, ఫైనాన్స్ ఆఫీసర్ శేషయ్య, లైబ్రేరియన్ యాదగిరి, ఎస్టాబ్లిష్మెంట్ అధికారి హనుమంతురావు సహా పలువురు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆరోపణల్లో వాస్తవం లేదని, ఎలాంటి అక్రమాలు జరగలేదని నిథమ్ డైరెక్టర్ చిన్నంరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఉద్యోగులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిథమ్‌కు సంబంధించి గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుందని, తన ఒక్కడి నిర్ణయంతో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.