హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): జనాభా ఆధారంగా కేంద్రప్రభుత్వం జరపాలనుకుంటున్న డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. కేంద్రం సూచనల మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలుచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని మండిప్డడారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో మార్చి 22న చెన్నైలో నిర్వహించతలపెట్టిన సమావేశానికి బీఆర్ఎస్ను ఆహ్వానించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన డీఎంకే నేతలు, ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ నెహ్రూ, రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
అనంతరం ఇరు పార్టీల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇది డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భమని పేర్కొన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 1970-80 దశకంలో కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలను కొత్త జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తామనడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున హాజరుకావాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్, తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని వెల్లడించారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారని డీఎంకే నేతలు కేఎన్ నెహ్రూ, ఎన్ఆర్ ఎలాంగో తెలిపారు. అందులో భాగంగా మార్చి 22న దక్షిణాది రాష్ర్టాల్లోని అన్ని పార్టీలతో చెన్నైలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామన్న బీఆర్ఎస్కు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, శేరి సుభాష్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు దూదిమెట్ల బాలరాజ్, శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్, కురువ విజయ్, సతీశ్, సుమిత్రాఆనంద్ తదితరులు పాల్గొన్నారు.