హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar)పోలీస్ అధికారులను ఆదేశించారు. దక్షిణ బస్తర్(South Bastar) లోని అరుణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న జరిగిన మందుపాతర(Land Mine) పేలుడులో 10 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మరణించిన సంఘటన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్(Video Conference) ద్వారా వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు(Political Leaders), వీవీఐపీల పర్యటన సమయంలో భద్రతా బలగాలు సంచరించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీం(Action Team)ల కదలికలు పెరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐటీ పరిశ్రమలు(IT Industries), అనేక బహుళజాతి సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా అంతర్జాతీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఒకర్ని దెబ్బతీయడం వల్ల వేలాది మందిని భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారన్నారు.
పోలీస్ శాఖ(Police Departments) నిరంతర కృషే వల్ల తెలంగాణలో వామపక్షతీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో 96 ల్యాండ్‌మైన్ అమర్చిన, పేలుడు ఘటనలు వెలుగుచూశాయని చెప్పారు. మావోయిస్టు చర్యలకు సంబంధించిన కీలక దాడుల్ని ఈ సందర్భంగా డీజీపీ అధికారులకు వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజీ ఎస్ఐబీ ప్రభాకర్ రావు, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
,