రాబందు కాంగ్రెస్.. రైతుబంధు బీఆర్ఎస్
రైతులను అన్యాయంగా అరిగోసపెట్టిన రాబందు పార్టీ కాంగ్రెస్ అయితే రైతుబంధు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ది.కాలంతో పోటీపడుతూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. 24 గంటల ఫ్రీ కరెంట్ అందిస్తున్నదీ బీఆర్ఎస్సే. ఉచిత విద్యుత్తు కోసం నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరోటి ఉన్నదా?
– కేటీఆర్
Minister KTR | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించాలని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. కరెంట్ విషయంలో రైతులను సమిధలు చేయటమే కాంగ్రెస్ విధానమని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అంటే పంట కోతలు, కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి మంత్రి మాట్లాడారు. కరెంట్ విషయంలో రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైతులకు 3 గంటలు చాలన్న దానిపై తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు విషయంలో కాంగ్రెస్‌కు ఒక విధా నమంటూ లేదని ఎద్దేవా చేశారు. కరెంట్ విషయంలో రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్‌ను ఊరి పొలిమేరల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
అమెరికాలో రేవంత్ తొందరపాటున రైతులకు 3 గంటల కరెంటే చాలని చెప్పి ఉంటారని అనుకున్నామని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర రైతులపై అవగాహనలేమిని, దుర్మార్గమైన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు మరోసారి రేవంత్‌రెడ్డి వెల్లడించారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే దరికి వస్తున్న రైతన్నలను కాంగ్రెస్ మరింత ఆందోళనకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తం పార్టీ నిజస్వరూపాన్ని గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుబంధుపై 70 లక్షల మంది రైతులను భిక్షగాళ్లతో పోల్చిన రేవంత్‌రెడ్డి తక్షణమే రైతులోకానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయదారులకు క్రాప్ హాలీడేలు, పరిశ్రమలకు పవర్ హాలీడేలేనని అన్నారు. ఆ పార్టీ కరెంట్ విధానంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికా పర్యటన నుంచి పదే పదే బరితెగించి బాహాటంగా అదే వైఖరిని రేవంత్‌రెడ్డి ప్రకటిస్తున్నారని ఉదహరించారు.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతుల మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. రైతుల కోసం 30 వేల కోట్లు వదులుకున్నాం కానీ, మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని చెప్పారు. రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని తెచ్చిందని, అలాగే 11 రాష్ర్టాలు రైతుబంధును పోలిన పథకాన్ని తెచ్చే అనివార్య పరిస్థితిని కల్పించిన ఘనత, చరిత్ర బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వందల కేసులేసి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసినా, పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులు అయ్యాయని, కాళేశ్వరం పూర్తిచేసి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తిచేయబోతున్నామని చెప్పా రు. రైతులను అవమానపర్చిన కాంగ్రెస్‌ను ఊరూరా నిలదీయాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తు న్న డిక్లరేషన్లు చిత్తుకాగితాలతో సమానమని కొట్టిపారేశారు. కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వకూడదని ఉదయ్‌పూర్‌లో చేసిన డిక్లరేషన్ ఉదయించకుండా నే అస్తమింపజేసింది కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.