కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తనాటకానికి తెరలేపింది. ఎన్డీఎస్ఏ చెప్పినట్టు చేస్తామని ఏడాదిన్నరపాటు సాగదీసింది. తీరా రిపోర్ట్ వచ్చి నెల రోజులు గడిచినా ముందడుగు వేయడం లేదు. తాజాగా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఎదురుతిరిగింది. పరీక్షలు చేయకుండానే నివేదిక ఎలా సిద్ధం చేస్తారంటూ ఎన్డీఎస్ఏ గాలి తీసేసింది. దీంతో రిపోర్ట్ విశ్వసనీయత కోల్పోయింది. దిక్కుతోచని పరిస్థితిలో పడిన ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. పునరుద్ధరణ కోసమంటూ మరో కమిటీ వేసేందుకు సిద్ధమైంది.
Medigadda Barrage | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 27(నమస్తే తెలంగాణ): ‘మేం ఇంజినీర్లం కాదు.. మేడిగడ్డ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాతనే ఆలోచిస్తం. వాళ్లు సూచించినట్టే మరమ్మతులు చేస్తం. అప్పటివరకు మేం ఎవరు చెప్పినా వినదలచుకోలేదు’.. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ సహా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ చెప్తున్న మాటలివి! ఇంజినీర్లు కాకపోవచ్చు గాని నాలుగు కోట్ల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని విచక్షణతో తెలివైన, కీలక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన కుర్చీలో కూర్చున్నారన్న విషయాన్ని సైతం వారు మరిచినట్టున్నారు.
ఏడాన్నరగా స్వార్థ రాజకీయాలనే తప్ప ప్రజా శ్రేయస్సును పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోయకుండా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండబెట్టారు. దిగువన ఆంధ్రప్రదేశ్ మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం గోదావరి జలాలపై కుట్రలు పన్నుతుంటే వాటికి ఆజ్యం పోసేలా ప్రాణహిత జలాలను కిందికి వదులుతున్నారు. వానకాలం మొదలు కావడంతో మరో సంవత్సరం కూడా మేడిగడ్డ పునరుద్ధరణ అనుమానమేని తెలుస్తున్నది. బీఆర్ఎస్ రజతోత్సవ జోష్‌ను పక్కదారి పట్టించేందుకో! మరేదైనా కారణమో గానీ ఎట్టకేలకు ఎన్డీఎస్ఏ గత నెల 24న తుది నివేదిక ఇచ్చింది.
అది ప్రభుత్వానికి చేరి నెల దాటింది. ఏడాదిన్నరపాటు శోధించిన కేంద్ర సంస్థ ఏం జరిగిందో చెప్పింది కానీ, ఏం చేయాలో చెప్పిందా?! చెప్తే ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నది? అసలు మేడిగడ్డపై ఎలా ముందుకు పోవాలనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ దిశానిర్దేశం ఉన్నదా? సర్కారు మాట దేవుడెరుగు.. కేంద్ర సంస్థ ఎన్డీఎస్ఏకైనా ఒక స్పష్టత ఉన్నదా? ఇవన్నీ డొల్ల వాదనలే! ఏడాదిన్నర పాటు కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామాలేనని తేలిపోయింది. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక మేడిపండు! పునరుద్ధరణకు ఏం చేయాలో మీరే చెప్పండంటూ బంతిని ఎల్అండ్టీ సర్కారు కోర్టులోకి నెట్టింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సెకండాఫ్ డ్రామాకు తెరలేపింది. పునరుద్ధరణ కోసమంటూ మరో కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనలకు రేపోమాపో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో అసలు ఎన్డీఎస్ఏ తేల్చనిది ఏమిటి? ఇప్పుడు ఈ కొత్త కమిటీ తేల్చేదేమిటి? ఇంకెన్నాళ్లు రైతులకు నీళ్లివ్వకుండా పోలవరానికి ప్రాణహిత పరుగులపై ప్రేక్షకపాత్ర పోషిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
నీటిని ఎత్తిపోయకుండా రాజకీయాలు
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కచ్చితంగా రెండు తరాలు గడవాల్సిందే. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరు దశాబ్దాలైనా పూర్తి ఫలాలు అందించలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ ప్రాజెక్టుకు సార్థకత వచ్చింది. అలాంటిది కేవలం మూడేండ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పూర్తిచేశారు. భీకర వరద కారణంగా అందులో ఒక చిన్న భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోయింది. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వమైతే వెంటనే పునరుద్ధరిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బరాజ్నే ఎండబెట్టింది. నీటిని ఎత్తిపోయకుండా ఆ సంఘటనను రాజకీయాలకు వాడుకుంటున్నది.
ఈ క్రమంలో రెండు సీజన్లలో ప్రాణహిత జలాలను ఎత్తిపోయక పోవడంతో రెండు యాసంగి సీజన్లలో అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయాయి. చెరువులను నింపే దిక్కులేక భూగర్భజలాలు పడిపోయి జనం అరిగోస పడ్డారు. విచారణ కొనసాగిస్తూనే బరాజ్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని బీఆర్ఎస్తో పాటు నిపుణులు సైతం ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నా సర్కారు ససేమిరా అన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో దీనిపై రాజకీయం చేసిన కేంద్రంలోని బీజేపీ ఎన్డీఎస్ఏతో ఏడాదిన్నర పాటు హైడ్రామా నడిపింది. దీన్ని అలుసుగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంస్థ నివేదికనే తమకు పరమావధిగా అన్నట్టు వ్యవహరించగా ఎన్డీఎస్ఏ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ వచ్చింది. చివరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ప్రజల్లో ఎక్కడ చూసినా ఇదే ఆసక్తి నెలకొనడంతో దాన్ని పక్కదారి పట్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హడావుడిగా ఎన్డీఎస్ఏ తుది నివేదికను బయటికి వదిలింది. కానీ బీఆర్ఎస్ సభ ముందు ఆ పాచిక పారలేదు. ఉన్న ఒక్క అస్త్రం విఫలం కావడంతో ఎన్డీఎస్ఏ చేతులెత్తేసింది.
ఎన్ని కమిటీలు… ఇంకెంత కాలం సాగదీస్తరు?!
ఇప్పుడు ఎన్డీఎస్ఏ కథ ముగిసింది. దీంతో రెండో ఎపిసోడ్‌కు కాంగ్రెస్ సర్కారు తెరలేపింది. మేడిగడ్డపై కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రేపోమాపో ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. ఇందులో మెంబర్ సెక్రటరీగా రామగుండం సీఈతో పాటు సభ్యులుగా గేట్ నిపుణుడు, వరంగల్ నీట్ ప్రొఫెసర్, ఎన్జీఆర్ఐ, రాక్ మెకానిక్, ఐఐటీ హైదరాబాద్, హైడ్రాలజీ నిపుణులను చేర్చింది. హడావుడి కమిటీ కావడంతో మరో ఇద్దరు ఆహ్వానిత సభ్యులంటూ 2 ఖాళీలు కూడా పెట్టింది. దీంతో మేడిగడ్డపై ఇప్పటివరకు కమిటీల సంఖ్య నాలుగుకు చేరినట్టు తెలుస్తున్నది. ఎన్డీఎస్ఏ ఒకటి కాగా జస్టిస్ ఘోష్ కమిటీ విచారణ ఓ వైపు కొనసాగుతూనే ఉన్నది.
మరోవైపు కొంతకాలం కిందట ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నేతృత్వంలో సీడీవో, రామగుండం, ఆపరేషన్-మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్లతో కూడిన కమిటీని వేసింది. ఆ కమిటీ విచారణ చేసి కొన్ని పనులు చేపట్టింది. కమిటీ చేపట్టిన గ్రౌటింగ్ పనుల వల్లనే అక్కడ సాంకేతికంగా ఇబ్బంది కలిగిందని, అందుకే తాము పునరుద్ధరణ చర్యలపై ఏం తేల్చలేకపోతున్నామంటూ ఎన్డీఎస్ఏ ఓ సాకు వెతుక్కున్నది. ఇలా రైతులకు సాగునీరు అందించేందుకు మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకుండా ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నది. ఇదే అదునుగా చంద్రబాబు, మోదీ ప్రభుత్వం గోదావరి జలాలను తన్నుకుపోతున్నా తెలంగాణకు జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని మాత్రం నిలువరించడం లేదు. తాజాగా ప్రభుత్వం వేస్తున్న కమిటీ మేడిగడ్డ పర్యటనలంటూ మళ్లీ హడావుడి మొదలుపెట్టడం, విచారణల పేరిట నోటీసులు ఇవ్వడం, జలసౌధలో భేటీలు, నివేదిక.. ఇలా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తకుండా రేవంత్ సర్కార్ ఇంకెంత కాలయాపన చేయనున్నదో కాలమే సమాధానం చెప్పాలి.
అయోమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం
నిన్నటిదాకా ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకొని మేడిగడ్డపై రాజకీయం నడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అయోమయంలో పడింది. రాజకీయంగా తమనేదో గట్టున పడేస్తుందనుకున్న ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదిక అంతా డొల్ల అని తేలడంతో ప్రభుత్వ పెద్దలకు ఏమీ తోచలేదు. ఈ సమయంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ లేఖ రూపంలో బాంబు పేల్చింది. ‘నివేదికలో ఏమున్నది? కనీసం టెస్టులు చేయకుండానే నిర్మాణ, నాణ్యత లోపాలున్నాయని ఎలా తేలుస్తారు?’ అని సూటిగా ప్రశ్నించడంతో సర్కారుకు దిమ్మతిరిగి పోయింది. ముఖ్యంగా ఇన్నాళ్లూ ఆ నివేదిక ఆధారంగానే మేడిగడ్డను పునరుద్ధరిస్తామంటూ చెప్తూ వచ్చిన ప్రభుత్వానికి అసలు ఆ దిశగా కార్యాచరణ లేకపోవడం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ‘బరాజ్ పునరుద్ధరణకు మేమేం చేయాలి? ఎలా చేయాలి? ఎంత పరిమాణంలో చేయాలి? అనే రోడ్‌మ్యాప్ ఇవ్వాలి’ అంటూ బంతిని ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వ కోర్టులోకి నెట్టేసింది. తామేదో రాజకీయంగా కాలయాపన చేయాలనుకుంటే చివరికి అది తమ మెడకే చుట్టుకుంటున్నదని ఆందోళన చెందిన ప్రభుత్వం హడావుడిగా మరో కమిటీని తెరపైకి తెచ్చింది.