తెలంగాణ లైఫ్‌లైన్ లాంటి కాళేశ్వరంపై విషం చిమ్మారు. ఒక్క బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టే కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. పనికిరాదని పడావు పెట్టారు. అంతటితో ఆగలేదు. తెలంగాణను సుజలతరంగిణిగా మార్చేందుకు కలలుగని, వాటిని మూడేండ్లలోనే అకుంఠిత దీక్షతో సాకారం చేసిన కేసీఆర్‌పై కమిషన్లు వేసి, విచారణ చేపట్టారు. కానీ.. కరువు వచ్చినప్పుడు, ఎల్ నినో కమ్ముకొచ్చినప్పుడు కిందికి పోతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు మాత్రం చేతులు రాలేదు. బీడు భూముల్ని చూసి గోడు వెళ్లబోసుకున్న రైతాంగానికి నీళ్లిచ్చేందుకు కనికరమైనా కలుగలేదు!
ఎన్డీఎస్ఏ సాకుగా ‘బయటపెట్టని’ ఓ నివేదిక పేరుతో రేవంత్ సర్కార్ నాటకాలాడింది. తన రాజకీయ కక్ష సాధింపునకు కేంద్ర సంస్థలపై నెపంమోపి, రైతాంగాన్ని బలిపెట్టింది. మేడిగడ్డే కాదు ఏ బరాజ్ లోనూ పంపింగ్ చేపట్టబోమని నిస్సిగ్గుగా ప్రకటించింది. తీరా ఆ అబద్ధాల ప్రచారభాండం బద్దలవుతున్నది. ఒక్కొక్కటిగా కాంగ్రెస్ కుట్రలు పటాపంచలవుతున్నాయి. ప్రాజెక్టు కట్టడం భగీరథ యత్నం.. పనిగట్టుకొని పడావు పెట్టడం అరాచకీయం. కాంగ్రెస్ అసలు రంగును రైతులు ఎప్పుడో గుర్తించారు.
మేడిగడ్డ ఏడోబ్లాక్లో స్వల్ప లోపాలు తప్పితే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా సేఫే అని మొన్న సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రకటించింది. నీళ్ల ఎత్తిపోతలకు అవేవీ అడ్డంకి కాదని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. కాళేశ్వరం నీళ్ల ఎత్తిపోతపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అవసరం మేరకు చర్యలు తీసుకోవచ్చునని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో స్పష్టంచేసింది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎన్డీఎస్ఏ (జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ) బట్టబయలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నిపుణులైన ఇంజినీర్లు ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపాలా? దిగువకు పంపించాలా? వద్దా? అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని తేల్చిచెప్పింది. హైకోర్టులో న్యాయవాది శరత్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ (ప్రమాణపత్రం)లో ఎన్డీఎస్ఏ పలు కీలక విషయాలను వెల్లడించింది. న్యాయవాది శరత్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతికంగా అనూహ్యమైన సహకారం అందించామని ఎన్డీఎస్ఏ వివరించింది.
విధాన తీవ్రంగా ఆక్షేపించింది. విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాలే గాని ఎన్డీఎస్ఏ కానేకాదని తేల్చిచెప్పింది. ముఖ్యంగా మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో రిజర్వాయర్‌లో నీటిని తోడివేయాలని లేదా నీటిని నింపవద్దని ఆదేశించడం ఎన్డీఎస్ఏ బాధ్యత కాదని స్పష్టంచేసింది. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు జరిగేలా చూడటం పూర్తిగా విధాన నిర్ణయమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టు పేర్కొన్నది. ఆ నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నదని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాను ఒక రైతు హోదాలో హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో ఎన్డీఎస్ఏ తరఫున సభ్య కార్యదర్శి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారని సీనియర్ న్యాయవాది శరత్ కుమార్ తెలియజేశారు.