హైదరాబాద్, డిసెంబర్11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిర్దేశిత ఆనకట్టల భద్రతకు సంబంధించిన డ్యామ్‌ల స మగ్ర భద్రత మూల్యాంకనం(సీడీఎస్ఈ) నిర్వహణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)చైర్మన్ అనిల్‌జైన్ రాష్ట్ర అధికారులను నిలదీశారు. ఇకనైనా గడువులోగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. చట్టం ప్రకారం నిర్దేశిత డ్యామ్‌లకు సంబంధించి డ్యామ్‌ల రిస్క్ అస్సెస్మెంట్ స్టడీ, ఎమర్జెన్సీ యాక్షన్‌ప్లాన్, డ్యామ్‌ల సమగ్ర భద్రత మూ ల్యాంకన ప్రక్రియను 2026 డిసెంబర్ నాటికి పూర్తిచేయాల్సి ఉన్నది. కానీ, ఈ ప్రక్రియలో తెలంగాణ వెనుకబడి ఉన్నదని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇప్పటికే కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్డీఎస్ఏ చైర్మన్ రాష్ర్ర్టానికి వచ్చారు.
గురువారం జలసౌధలో ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ అమ్జద్హుస్సేన్, స్టేట్డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులు, సీఈలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రమాణాల ఆధారంగా చట్టం పరిధిలోకి చేర్చిన 175 రాష్ట్ర ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు మాట్లాడుతూ.. సీడీఎస్ఈ పూర్తికి మరింత గడువు కావాలని కోరగా, అందుకు ఎన్డీఎస్ఏ నిరాకరించినట్టు తెలిసింది. అనంతరం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్ మాట్లాడుతూ.. గడువులోగా సీడీఎస్ఈ పూర్తిచేయాలని, అందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు.