SLBC Tunnel Project | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఇదిలా ఉంటే టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలంటే టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్)ను పూర్తిగా కట్ చేయాల్సిందేనని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారని తెలుస్తున్నది. శిథిలాల తొలగింపునకు దాదాపు నెల రోజుల సమయం పడుతుందని, అప్పుడుగాని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేమని స్పష్టంచేసినట్టు సమాచారం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14 కిలో మీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగితే అక్కడి నుంచి దాదాపు 500 మీటర్ల వరకు మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగం మూసుకుపోయిందని తెలుస్తున్నది.
ఇదే ఇప్పుడు సహాయ చర్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. సాధారణంగా సొరంగంలోకి వెళ్లేందుకు, కార్మికులను, యంత్ర పరికరాలను తరలించేందుకు రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేరే భారీ యంత్రాలు కూడా లోపలికి తీసుకుపోయే అవకాశం లేకుండా పోయింది. కూలిపోయిన శిథిలాలను తరలించాలంటే ప్రస్తుతం ఏకైక మార్గం రైల్వేట్రాక్. ఆ మార్గంలోనే శిథిలాలను బయటకు తీసుకురావాల్సి ఉంది. ట్రాక్ కూడా దాదాపు 2 కిలో మీటర్ల వరకు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని, నడుము లోతు నీరు, బురద పేరుకుపోయిందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివరిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంటును కూడా పునరద్ధరించలేదు.
ప్రస్తుతం శిథిలాలను తొలగించడం ఒక సవాలైతే, వాటిని బయటకు తీసుకురావడం మరో సవాలు అని అంటున్నారు. అదీగాక శిథిలాలు మొత్తంగా టీబీఎంపై పడిపోగా, అది పూర్తిగా ధ్వంసమైందని తెలుపుతున్నారు. టీబీఎంను కట్ చేస్తే కానీ శిథిలాల తొలగింపు సాధ్యం కాదని తెలుపుతున్నారు. ప్రస్తుతం సొరంగం లోపల నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను చూస్తే దాదాపు నెల రోజుల సమయం పడుతుందని వివరిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన, సహాయ చర్యలపై సీఎం రేవంత్ సమీక్షించారు. సీఎంవో కార్యాలయం ఆదివారం సా యంత్రం ప్రకటన విడుదల చేసింది. సహా య చర్యలను పర్యవేక్షించిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సీఎం మాట్లా డి వివరాలను తెలుసుకున్నారని పేర్కొం ది. అదేవిధంగా కార్మికులను రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నాలను కొనసాగించాలని అధకారులను సీఎం ఆదేశించారని సీఎంవో ప్రకటనలో వెల్లడించింది.