హైదరాబాద్ : రాష్ట్రానికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ చేసిన సేవలు చిరస్మరణీయం అని పలువురు వక్తలు అన్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ 146వ జయంతి, 10 వ ఇంజినీర్స్ డే సందర్భంగా జల సౌధలో ఆయన విగ్రహానికి జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్,సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల ఇంజినీర్స్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవాజ్ జంగ్ జన్మదినాన్ని తెలంగాణ ఇంజినీర్స్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
నవాబ్ అలీ నవాజ్ జంగ్ నాడు నిర్మించిన నిజాం సాగర్ ను నేడు అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన కాళేశ్వరం జలాలతో నింపాము. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు లేకున్నా ఇవాళ నిజాం సాగర్ సజీవంగా ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తోనేసాధ్యం అయిందన్నారు. నీళ్ల కోసం, నిధుల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. వారి కోసం నవాబ్ అలీ జంగ్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఒకరికి అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. అందులో భాగంగా వి.ప్రకాష్ లక్ష రూపాయల చెక్ అందజేశారు.