హనుమకొండ చౌరస్తా, నవంబర్ 7: పుస్తక పఠనంతోనే ప్రపంచ విజ్ఞానం సాధ్యమని హనుమకొండ ఏసీపీ పి.నరసింహరావు అన్నారు. శుక్రవారం హనుమకొండ అశోక కాంప్లెక్స్‌లో నవచేతన బుక్ హౌస్‌లో ఘనంగా పుస్తక ప్రదర్శన ప్రారంభించారు. గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఏసీపీ ప్రారంభించి మాట్లాడుతూ మనిషిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి పుస్తకాలకే ఉందని, విద్యార్థిదశ నుంచే పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలన్నారు.
సీపీఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రముఖ ప్రచురణ సంస్థలకు చెందిన అనేక రకాల పుస్తకాలను తగ్గింపు ధరలతో నవచేతన బుక్‌హౌస్ ద్వారా పాఠకులకు అందించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బుక్‌హౌస్ మేనేజర్ ఎర్ర నాగరాజు మాట్లాడుతూ.. ఈ పుస్తక ప్రదర్శన ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని, ఈ పుస్తక ప్రదర్శనలో 10 నుంచి 40 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ర్ట సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, తోట బిక్షపతి, నాయకులు ఎన్.అశోక్ స్టాలిన్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, టీయూడబ్ల్యూజే రాష్ర్ట ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, జిల్లా కార్యదర్శి తోట సుధాకర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎలుగటి తిరుపతిరెడ్డి, న్యాయవాదులు బండి మొగిలి, ఏరుకొండ జయశంకర్, ఎం.సదాశివుడు, జర్నలిస్టులు మంచాల రాజు, ఎండి.ఉస్మాన్‌పాషా, తాండూరు గోపి, పి.కిషోర్‌కుమార్, కుక్కల రాజు, సిబ్బంది అకినెపల్లి రమేష్, టి.సూర్య పాల్గొన్నారు.