హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్‌ను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల్లో నేచురోపతి (ప్రకృతి ) వైద్యం పట్ల పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా నేచర్ క్యూర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అందుకు కావాల్సిన సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రకృతి వైద్యంలో ప్రసిద్ధి పొందిన మంతెన సత్యనారాయణ సలహాలు, సూచనలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. నేచర్ క్యూర్ విభాగం నుంచి ప్రత్యేక బృందాన్ని విజయవాడ లోని సత్యనారాయణ నేచురోపతి హాస్పిటల్‌ను సందర్శించాలన్నారు.

అక్కడ అందుతున్న సేవలు, డైట్, ఇతర సదుపాయాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. నేచర్ క్యూర్ హాస్పిటల్లో నేచురోపతి ఓపి, ఐపి సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దవాఖానలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని మంత్రి సూచించారు. రోగులకు సేవలు అందించేందుకు సరిపడా వైద్య సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
దేశంలో ఎంతో ప్రాముఖ్యం పొందిన నేచర్ క్యూర్ హాస్పిటల్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన ప్రకృతి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.
సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ పాల్గొన్నారు.