హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలవంతంగా డిజిటలైజేషన్‌ను దేశంపై రుద్దింది. కానీ భద్రతను మాత్రం గాలికొదిలేసింది. దీని వల్ల వ్యక్తిగత సమాచారమే గాకుండా దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం కూడా సులభంగా చోరీకి గురవుతున్నది. డాటాచోరీని అరికట్టడానికి డాటా ప్రైవసీ పాలసీ బిల్లును 2022లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టినా.. బిల్లును పాస్ చేయటంలో మోదీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నది. ఫలితంగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కేంద్రానికి తొత్తుగా వ్యవహరించే కొన్ని సంస్థల ప్రయోజనాల కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తాకట్టు పెడుతున్నదని మండిపడుతున్నారు.
2019లోనే తిరస్కరణకు గురైన బిల్
డచ్ సైబర్‌సెక్యూరిటీ సంస్థ సర్ఫ్‌షార్క్ వీపీఎన్ అంచనా ప్రకారం 2022 ప్రథమార్థంలో జరిగిన డాటాచోరీలో భారతదేశం రెండోస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌కు చెందిన సైబర్‌సెక్యూరిటీ పరిశోధకుడి మాటల్లో చెప్పాలంటే.. మన దేశంలోని 280 మిలియన్ పౌరుల కీలక వ్యక్తిగత సమాచారమంతా ఈపీఎఫ్ సంస్థ డాటాబేస్‌లో ఉన్నది. ఈ సమచారమంతా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నది. వీటిలో పూర్తిపేరు, నామిని వివరాలు, వైవాహిక వివరాలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో పాటు ఆధార్, ఆదాయ వివరాలన్నీ ఉన్నాయి. ఇంతమంది కీలక సమాచారం ఆన్లైన్లో ఉన్నా.. దీనికి దేశంలో చట్టబద్ధమైన భద్రత ఇప్పటిదాకా కల్పించలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి 2019లో పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్‌ను రూపొందించారు. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
త్వరలో మరింత పటిష్టమైన బిల్లును రూపొందిస్తామని అప్పట్లో చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో 2017లోనే ఈ బిల్లు ముసాయిదాపై కమిటీ వేశారు. 2018లో కమిటీ బిల్లు ముసాయిదాను సమర్పించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2019లో లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అదే రోజు జాయింట్ పార్లమెంట్ కమిటీకి రెఫర్ చేశారు. రెండేండ్ల తర్వాత డిసెంబర్ 16, 2021న జేపీసీ నివేదికను ఇచ్చింది. అయితే అప్పటి ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ఈ బిల్లులో 81 సవరణలు చేయాల్సి ఉన్నదని, అందులో 12 ప్రధానమైన అంశాలున్నాయని చెప్తూ బిల్లును తిరస్కరించారు. 2017లోనే సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టమైన తీర్పును వెలువరించింది. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం తేల్చి చెప్పింది.
చేతులు కాలక ముందే
సుమారు వంద కోట్ల మంది సమాచారం నేరస్థుల గుప్పిట్లో ఉందన్నది కఠినవాస్తవం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డాటాప్రైవసీ బిల్‌ను పాస్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లే దేశప్రజల వ్యక్తిగత సమాచారానికి శ్రీరామరక్ష అని ఐటీ, నిఘా సంస్థల నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల మోసాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే అవకాశం ఉంటుందన్నారు.