ఖరీదైన కార్లు.. అడ్డూఅదుపు లేని డ్రైవింగ్.. మితిమీరిన వేగం.. అడ్డొస్తే అంతే సంగతులు.. అవతలి వారి ప్రాణాలు హరి.. మరి కేసుల మాటేమిటి? చట్టాన్ని చుట్టంగా మలచుకోవడమే బలవంతులకు సులువైన మార్గం. ఆ బలవంతులకు వత్తాసు పలుకడమే ప్రభుత్వాల, పోలీసుల విధిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కేసుల్లో వీఐపీల పిల్లలు ఉంటే, వారికి అనుకూలంగా ఏకంగా సెక్షన్లనే మార్చేస్తున్నారని అభియోగాలున్నాయి!
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తాజాగా హైదరాబాద్ మాదాపూర్‌లో ఏపీకి చెందిన ఓ ఎంపీ కొడుకు కారు నడుపుతూ భారతి ముఖి అనే ఓ సేల్స్‌గర్ల్ నిండు ప్రాణం తీసిన ఉదంతంలోనూ బలహీన సెక్షన్లు పెట్టి, నిందితుడిని స్టేషన్ బెయిల్‌తో అదేరోజు ఇంటికి పంపడంపై వివాదం చెలరేగింది. ఈ కేసులో రేవంత్ సర్కార్ వైఖరిపై రెండు రాష్ర్టాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడికి ఒక రకంగా, వీఐపీలకు మరో రకంగా సెక్షన్లను మార్చేస్తున్నారని సామాజికమాధ్యమాల్లో దునుమాడుతున్నారు.
ఖరీదైన లగ్జరీ కార్లు, రోడ్లపై అతివేగంతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నా.. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించడం రెండు తెలుగు రాష్ర్టాల్లో సాధారణ విషయంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ పౌరుడు చిన్న తప్పుచేసినా, ఆఖరికి సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినా కఠినమైన నాన్ బెయిలబుల్ సెక్షన్లతో జైలుకు పంపే పోలీసులు.. వీఐపీల పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తించి, పౌరుల ప్రాణాలు తీసినప్పుడు మాత్రం పనిగట్టుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ. జాతీయ మీడియా సైతం ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నది.
ఈ ప్రశ్నలకు బదులేది?
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన సామాన్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జనసేనకు చెందిన ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమేని సంజూశ్ (21) ఖరీదైన కారు (టీజీ 09జీ0666)ను అతివేగంగా నడుపుతూ రోడ్డు దాటుతున్న భారతి ముఖి(26) అనే యువతిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే సంజూశ్ను తప్పించేందుకు, మరో ప్రైవేట్ డ్రైవర్‌ను నిందితుడిగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసుల కేసును నీరుగార్చే ప్రయత్నంచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీన్ని పోలీసులు ఖండిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
అతివేగంతో వచ్చి యువతి ప్రాణాలు తీసిన ఘటనలో నిందితుడు వీఐపీ కొడుకు కావడంతో కూల్‌గా బెయిల్‌పై బయటకు వెళ్లడం వెనుక పోలీసులపై తీవ్రమైన ‘రాజకీయ ఒత్తిళ్లు’ ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రగతిభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన ఘటన అనంతరం.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా అతని తండ్రికి కూడా పోలీసులు నోటీసులిచ్చి వేధింపులకు పాల్పడ్డారు. ఏపీలో వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి కొడుకు రోడ్డు ప్రమాదం చేస్తే, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో ఏకంగా మాజీ మంత్రినే అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, ఇలా రోడ్డు ప్రమాదాలను అవసరాలను బట్టి అధికార పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
వీఐపీలకు ఈజీగా బెయిల్
వీఐపీలైతే రోడ్డు ప్రమాదాల్లో ఎంతమందిని చంపినా బెయిల్ మాత్రం సులువుగా వచ్చేస్తుందని కొన్ని ఘటనలను బట్టి తెలుస్తున్నది. మహారాష్ట్ర పుణెలో ఒక వ్యాపారవేత్త కొడుకు మద్యం మత్తులో అతివేగంగా పోర్షేకారు నడిపి ఇద్దరు ఐటీ ఉద్యోగులను బలితీసుకున్నాడు. ఆ తర్వాత అతడు గంటల వ్యవధిలోనే బెయిల్ పొందాడు. ఈ అంశం కూడా అప్పట్లో జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేగింది. ముంబైలో అధికార పార్టీ నేత కొడుకు బీఎండబ్ల్యూ కారుతో ఒక మహిళను ఢీకొట్టి కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఆ సమయంలోనూ పోలీస్ యంత్రాంగం నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించిందనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి చట్టం అనుకూలంగా మారిపోవడంపై సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పోలీసుల్లో పారదర్శకత ఎక్కడ?
ఇలాంటి రోడ్డు ప్రమాద ఘటనల్లో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, లోపిస్తున్న పారదర్శకత కారణంగా చట్టాలపైనే సామాన్యులకు నమ్మకం లేకుండా పోతున్నదని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చట్టం అనేది సామాన్యుడిని బంధించే వలగా, శ్రీమంతులను తప్పించే రహదారిగా మారిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా రా జకీయ సన్నిహితుల కుటుంబాలకు ఇబ్బంది కలుగకుండా దర్యాప్తులను నీరుగారుస్తున్నాయో బండి భగీరథ్ ఉదంతంలోనూ, లింగమనేని సంజూశ్ ఉదంతాలను బట్టి చూస్తే అర్థమవుతున్నది’ అని ఓ నెటిజన్ పోస్టు చేయగా.. ఏపీలో బాబు కూటమితో ఉన్న సఖ్యత కారణంగానే ఇక్కడి కాంగ్రెస్ పెద్దలు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి రాజకీయ, ధన ప్రభావాలకు లొంగిపోకుండా కఠిన సెక్షన్లను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చట్టం వీఐపీలకు చుట్టం కాదని, నిరుపేద పౌరుడి ప్రాణానికి రక్షణ కల్పించే వజ్రాయుధం అని నిరూపించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపైనే ఉన్నదని వారంటున్నారు.