హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నది. ఆనవాయితీని అనుసరించి బీఆర్ఎస్ మాగంటి సునీతా గోపీనాథ్‌కు టిక్కెట్ ఇవ్వగా, కాంగ్రెస్ కనీస కనికరం లేకుండా అభ్యర్థిని బరిలో నిలిపింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బాధితులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ బీజేపీ మాత్రం ఎక్కడా రంగంలో కనిపించడం లేదు. ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారం ఊసే లేదు. రాష్ట్ర అధ్యక్షుడు తనకేం పట్టనట్టు వ్యవహరిస్తుండగా.. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ఉపఎన్నికవైపే కన్నెత్తి చూడటం లేదు.
మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌ది సైతం ఇదే తీరు. బీజేపీ ఎంపీ లు, ఎమ్మెల్యేలు ప్రధాన నేతల బాటలోనే అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో బీజేపీ ముందే కాడి పారేసిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా చేసిన విమర్శలు దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో తడబడుతున్న బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. ‘కిషన్‌జీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నరు? అంటూ అక్కడి ఓటర్లు అడుగుతున్నారు. బీఆర్ఎస్ని గెలిపిస్తారా లేదా కాంగ్రెస్‌కు పట్టం కడుతారా? అంటూ సోషల్ మీ డియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ ఓటమితో మీ గౌర వం ప్రమాదంలో పడింది. భారీ ఓట్లతో ఓడితే జాతీయ నాయకులకు ముఖం ఎలా చూపిస్తా రు? కొద్దిగా ఆలోచించండి.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో మీకు మేలు చేసే అలవాటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నన్ను బయటకు పంపినట్టుగానే.. మీరూ ఏదో ఒకరోజు వెళ్లడం పక్కా!’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కిషన్‌రెడ్డి మధ్య ఉన్న స్నేహబంధం కారణంగానే జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థిని పెట్టలేదని వ్యాఖ్యానించారు. ‘అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంపై మీ మిత్రుడిని అడగండి’ అంటూ కిషన్‌రెడ్డికి చురకలంటించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మొదలు ముఖ్య నేతలంతా అసలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగడం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు వాపోతున్నారు. ఓవైపు ఉపఎన్నిక విషయంలో పార్టీలన్నీ నెత్తిమీద కుం పట్లు పెట్టుకున్నట్టు హడావుడి చేస్తుంటే, బీజేపీ అధ్యక్షుడు మాత్రం తన బంధువు కోరిక తీర్చేందుకు ఓ సినీనటుడిని వెతుక్కుంటూ వెళ్లి, దగ్గరుండి ఆయన షూటింగ్ చూపించారని చెప్తున్నా రు. కిషన్ రెడ్డి తన నియోజకవర్గంలోనే ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో నడుస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌తో అంతర్గతంగా జరిగిన ఒప్పందమే కారణమని అనుమానిస్తున్నారు. బీజేపీ, ఎంఐఎంను బరిలో లేకుండా చేస్తే వారి ఓట్లు తమకు లాభిస్తాయని కాంగ్రెస్ పెద్దలు భావించారని, ఈ మేరకు ఒప్పందాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.