Minister KTR | రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి బీజేపీ, కాంగ్రెస్‌ల మైండ్ బ్లాంక్ అయ్యిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్ బాస్‌లు ఢిల్లీ లో ఉంటారు.. కానీ, బీఆర్ఎస్కు గల్లీలో ఉం డే ప్రజలే బాస్‌లు’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను నకల్ కొట్టేందుకు అకల్ ఉండాలని జాతీయ పార్టీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లాగా చూడాలని సూచించారు. తనకు బాగా నచ్చిన పథకం ‘కేసీఆర్ బీమా’ అని చెప్పారు. ఈ పథకం పేదలందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ఊరూరికి వెళ్లి సర్కా రు చేసిన పనులను చెప్పి ఓటు అడగాలని సూచించారు. ‘ఈ 45 రోజులు మా కోసం పనిచేస్తే వచ్చే ఐదేండ్లు మీ కోసం పనిచేస్తాం’ అని కార్యకర్తలకు సూచించారు.
తెలంగాణను కేసీఆర్ ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమిస్తే నాలుగు ఓట్లు వస్తాయని, కేసీఆర్‌ను తిడితే రావని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు. సిరిసిల్లలోని రగుడు జంక్షన్ వద్ద నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సోమవారం పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సాయం త్రం వేములవాడలోని సంగీత నిలయంలో నియోజకవర్గ కార్యకర్తలతో వ్యక్తిగతంగా మాట్లాడి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశా రు. విపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూనే సర్కారు అమలు చేస్తున్న పథకాలను ఏకరువు పెట్టారు. ప్రతిపక్షాల విమర్శలకు వెంట వెంట కౌంటర్ ఇవ్వాలని సూచించారు.
బీజేపీ డిపాజిట్లు గల్లంతు కావాలి
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రూ.400కే సిలిండర్ ప్రకటించామని.. ఓటేసేటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని తలచుకొని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని, ఆ పార్టీని పొల్లుపొల్లు చేయాలని పిలుపునిచ్చారు. ‘కరీంనగర్‌కు భీముడు.. ఆయనకి మనం చెప్పేది ఏముంది.. భారీ మెజార్టీతో గెలుస్తాడు’ అని మంత్రి గంగులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలని కార్యకర్తలకు సూచించారు. 60 లక్షల సైన్యం ఉన్న పార్టీ తమదని, గులాబీ జెండా అంటేనే పేదల జెండా అన్నది మరువవద్దని సూచించారు. 2004లో బీఆర్ఎస్కు ఒక కార్యాలయం లేద ని, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం ఇస్తే తెలంగాణ వాళ్లకు ఇంత పెద్ద భవ నం ఎందుకని ఆనాటి ప్రభుత్వం వెళ్లగొట్టిందని గుర్తుచేశారు.
నాటి ఘటనను ప్రస్తావిస్తూ వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థనే శాశ్వతమని చెప్పారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆనాడే నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. పార్టీ కార్యాలయంలోని ఫంక్షన్ హాలును శుభకార్యాలకు కార్యకర్తలు, అనాథలు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి ఉచితంగా ఇవ్వాలని సూచించారు. ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చే బాధితులు పార్టీ కార్యాలయంలో ఇస్తే తీసుకొని సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు చక్రపాణి, టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు చీటి నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు.