చరిత్ర కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ధనికరాష్ట్రం. ఈ వాస్తవాన్నే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి నేటిదాకా పదే పదే చెప్పేవారు.. తలసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధిరేటు సాక్షిగా తెలంగాణ ఎంత సుసంపన్నమైనదో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. తద్వారా తెలంగాణ పరపతి పెంచడంతోపాటు భారీ ఎత్తున పరిశ్రమలను ఆకర్షించారు.
ఈ వ్యూహం తెలియని కాంగ్రెస్ నేతలు ఆయనను తప్పుబట్టేందుకు, బోనులో నిలబెట్టేందుకు తెలంగాణ అప్పులపాలైందంటూ కొత్తరాగం అందుకున్నారు. ఢిల్లీ మీడియా సమావేశాల్లోనూ, జాతీయ చానళ్ల ఇంటర్వ్యూలోనూ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కేసీఆర్ పాలనను తిట్టడం కోసం తెలంగాణ రుణగ్రస్తమైందని, మూలధనం లేదని మాట్లాడారు. దీంతో తెలంగాణ ఇమేజ్ నేషనల్ లెవల్లో డ్యామేజ్ అయ్యింది. కేసీఆర్ పరిపాలన సాగిన పదేండ్లపాటు తెలంగాణ నేషనల్ సెలబ్రేషన్‌గా నిలిస్తే, మొన్న ఇండియాటుడే కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యతో తెలంగాణ ఇమేజ్‌కి నేషనల్ లెవల్లో డ్యామేజ్ జరిగింది. గత పదిరోజులుగా ఏ జాతీయస్థాయి పత్రికను తిరగేసినా లేదా మీడియా చానళ్లను చూసినా తెలంగాణ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే వార్తలే కనిపిస్తున్నాయి.
Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): నవ్వేటోళ్ల ముందు కాలు జారి పడ్డట్టే అయ్యింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ‘గుజరాత్ మాడల్’ అంటూ పుష్కరకాలం కిందట కాలరెగిరేసిన వాళ్లకు.. దేశానికి కావాల్సిన అసలు సిసలైన మాడల్ ఇదీ అంటూ తెలంగాణను దేశానికే ఓ దిక్సూచీగా మార్చారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే, కేసీఆర్ శ్రమ అంతా ఇప్పుడు బూడిదలో పొసిన పన్నీరు చందంగా మారిపోతున్నది. పదేండ్లు పొత్తిళ్లలో కంటికి రెప్పలా సాదిన బిడ్డ ఇప్పుడు అంగట్లో ఓ వార్తా సరుకుగా మారుతున్నది. దేశానికే ఓ అభివృద్ధి దివ్వెగా నిలిచిన తెలంగాణ పరపతి గాలిలో కలుస్తున్నది. రాష్ర్టానికి పెద్దదిక్కుగా పిలిచే సీఎం రేవంత్‌రెడ్డి అసంబద్ధ, అనాలోచిత వ్యాఖ్యలే ఇందుకు కారణంగా పారిశ్రామికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ఆర్థిక క్రమశిక్షణకు, సంక్షేమ పథకాలకు, తలసరి ఆదాయానికి, జీఎస్డీపీ పెరుగుదలకు, పారిశ్రామికాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు, కొత్త కంపెనీల రాకకు, ఐటీ ఎగుమతులకు, ఉపాధి అవకాశాలకు, ధాన్యం ఉత్పత్తికి, స్వచ్ఛమైన తాగునీటికి ఇలా ఒక్కటేమిటి పలు రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉన్నదంటూ కేసీఆర్‌పాలన సమయంలో నిన్నమొన్నటివరకూ జాతీయ మీడియా తెలంగాణను ప్రశంసించింది. అయితే ఇప్పుడు అదే మీడియాలో పొద్దున లేచింది మొదలు తెలంగాణలోని సమస్యల చిట్టానే పుంఖానుపుంఖాలుగా వార్తలను ప్రసారం చేస్తున్నది. ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో తెలంగాణ, తెలంగాణ నుంచి కంపెనీలు బయటకు, నీళ్లు లేక తెలంగాణలో ఎండిపోతున్న పంటలు, కర్ణాటక వాల్మీకి స్కామ్ లింకులు తెలంగాణలో, అప్పులబాధతో బ్యాంకులో తెలంగాణ రైతు ఆత్మహత్య.. ఇలా ఏ ఇంగ్లీష్ పేపర్‌ను చూసినా.. ఏ చానల్‌ను ట్యూన్ చేసినా రోజూ ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఎట్లుండె తెలంగాణ.. 15 నెలల్లోనే ఇట్లా అయ్యిందంటూ రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
మొన్నటి సంగతి
మరి ఇప్పుడు?
జాతీయ స్థాయిలో ఏ పత్రికను తిరగేసినా..ఏ చానల్‌ను ట్యూన్ చేసినా కనిపిస్తున్న వార్తలు ఇవి.
తెలంగాణ పరపతి గాలికి..
‘ఎన్నికల బరిలోకి దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరుగెత్తాల్సిందే. ఈ క్రమంలోనే హామీలనిచ్చాం’ అంటూ జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకొన్నారు. అంతేనా, ప్రభుత్వం తరఫున కనీసం రూ.500 కోట్లను కూడా మౌలిక వసతులకు, పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఉందంటూ ఇదేదో గొప్పవిషయమన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయగానే, ఆ కాంక్లేవ్‌లో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, రాజకీయ విశ్లేషకులతో సహా ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయ్, ప్రీతి కూడా ఫక్కున నవ్వారు. రేవంత్ వ్యాఖ్యలపై ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆ కాంక్లేవ్‌లో పాల్గొన్న బెంగళూరుకు చెందిన రతన్ మిశ్రా అనే ఓ ఏంజెల్ ఇన్వెస్టర్‌ను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇంటిపెద్దగా వాటిని చక్కబెట్టాలిగానీ సంసారాన్ని బజారున పెడ్తారా? ఇప్పుడు సీఎం రేవంత్ వ్యవహారంకూడా అలాగే ఉంది. రాష్ట్రప్రభుత్వం తరుఫున మౌలిక వసతులకు ఏమాత్రం నిధులను కేటాయించే పరిస్థితిలో లేమని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తే, కొత్త కంపెనీలు రాష్ర్టానికి ఎలా వస్తాయి? యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకేనేమో తెలంగాణ నుంచి కంపెనీలు వేరే రాష్ర్టానికి తరలివెళ్తున్నాయి’ అంటూ మిశ్రా బదులిచ్చారు. ఇలాంటి వేదికలపై సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలంగాణ పరపతి గాలిలో కలిసినట్టేనని మిశ్రా పేర్కొనడం గమనార్హం.
అసెంబ్లీ సాక్షిగా మళ్లీ..
‘ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడానికే కష్టపడుతున్నాం. డీఏ గురించి అడగొద్దు’ అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించడం, ఆర్బీఐ నుంచి చేబదులు తీసుకొంటున్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక మీడియాలోనే కాకుండా జాతీయమీడియాలోనూ కలకలం సృష్టించాయి. ఒక్క ఏడాదిలోనే తెలంగాణలో ఈ పరిస్థితులు దాపురించడం ఏమిటంటూ టైమ్స్ గ్రూప్, ఇండియా టుడే వంటి ప్రఖ్యాత చానల్స్ చర్చా కార్యక్రమాలను ప్రసారం చేశాయి. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం పెచ్చరిల్లిందంటూ హిందుస్థాన్ టైమ్స్, న్యూస్18, టైమ్స్ నౌ, డెక్కన్ హెరాల్డ్, బిజినెస్ టుడే వంటి న్యూస్వెబ్సైట్లు, టీవీలు ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక దివాలా అంచుకు చేరుకొన్నట్టే ఇప్పుడు తెలంగాణ కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయినట్టు ఆయా వెబ్సైట్లు వార్తా కథనాలను ప్రచురించాయి. అప్పుల గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న విధానపరమైన నిర్ణయాలను బట్టే రాష్ర్టానికి పరిశ్రమలు క్యూకడతాయని సాయికాంత్ అనే మరో పారిశ్రామికవేత్త అన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కార్నింగ్ ఇంటర్నేషనల్ తమిళనాడుకు, కేన్స్ సెమీకండక్టర్ గుజరాత్‌కు తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయిందని ‘బిజినెస్ స్టాండర్డ్’ ఓ కథనంలో వెల్లడించింది. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో, రేవంత్ అనాలోచిత ప్రకటనలతో తెలంగాణ పరపతి అంతకంతకూ దిగజారుతున్నదని సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
National Headlines
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ప్రస్తావన వస్తే జాతీయ మీడియాలో కనిపించే హెడ్‌లైన్స్ ఇవి
ఆర్బీఐ నుంచి చేబదులు
తెలంగాణ ఆర్థికస్థితి బలహీనంగా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటితారీఖున జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. డీఏ చెల్లింపులపై పట్టుబట్టవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కోసం ఆర్బీఐ నుంచి రూ. 4 వేల కోట్లను చేబదులుగా రుణం తీసుకొన్నాం.
– అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి
రూ.500 కోట్లను కూడా పెట్టలేం
ఎన్నికల బరిలోకి దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరుగెత్తాల్సిందే. ఈ క్రమంలోనే హామీలు ఇచ్చాం. ప్రభుత్వం తరఫున కనీసం రూ.500 కోట్లను కూడా మౌలిక వసతులకు, పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది.
– ఈ నెల 8న ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో రేవంత్
అందుకే కంపెనీలు బయటకు..
ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇంటిపెద్ద వాటిని చక్కబెట్టాలిగానీ సంసారాన్ని బజారున పెడ్తరా? ఇప్పుడు సీఎం రేవంత్ వ్యవహారం కూడా అలాగే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మౌలిక వసతులకు ఏమాత్రం నిధులను కేటాయించే పరిస్థితిలో లేమని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తే, కొత్త కంపెనీలు రాష్ర్టానికి ఎలా వస్తాయి? యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకేనేమో తెలంగాణ నుంచి కంపెనీలు వేరే రాష్ర్టానికి తరలివెళ్తున్నాయి.
– రతన్ మిశ్రా, ఏంజెల్ ఇన్వెస్టర్, బెంగళూరు
తెలంగాణ దారిలోనే..
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక రూ.4 వేల కోట్లు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. ఇప్పుడు తెలంగాణ దారిలోనే కర్ణాటక భారీగా అప్పులు చేస్తున్నది.
– ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ (రేవంత్‌పై టైమ్స్‌నౌ కథనాన్ని ఉటంకిస్తూ..)
ఆచితూచి మాట్లాడాలి
రాష్ట్ర ఆర్థిక స్థితి, ప్రభుత్వం చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, తీసుకొంటున్న విధాన పరమైన నిర్ణయాలను బట్టే రాష్ర్టానికి పరిశ్రమలు క్యూకడతాయి. ఈ అంశాలపై ప్రభుత్వ పెద్దలు ఆచితూచి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉన్నది.
– సాయికాంత్ యువ పారిశ్రామికవేత్త