హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయిలో చారిత్రక నాణేల సదస్సును డిసెంబర్ 11,12 తేదీల్లో ఎంసీఆర్హెచ్ఆర్డీలో రాష్ట్ర వారసత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను శుక్రవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు జాతీయస్థాయిలో ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలిపారు. న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో తెలంగాణ వారసత్వశాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు ఏర్పాటు చేశామని నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాణేల అధ్యయనంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతామని చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాంపల్లిలోని చేనేత భవన్లో శుక్రవారం ఐఐహెచ్‌టీ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గౌరవార్థం ఐఐహెచ్‌టీకి ఆయన పేరు పెట్టామని తెలిపారు. ఇది దేశంలోనే మంచి ఇనిస్టిట్యూట్‌గా నిలవాలని అధికారులను ఆదేశించారు. చేనేత రంగానికి త్వరలోనే మహర్దశ పట్టనున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.1000 కోట్లు నిధులు ఈ రంగానికి విడుదల చేసినట్టు వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్‌తో చేనేత కార్మికులు పని కల్పించామని వివరించారు. వేములవాడలోని యార్న్ డిపో రూ.50 కోట్లతో ఏర్పాటు చేశామని, 2368 మెట్రిక్ టన్నుల నూలు పంపిణీ చేశామని తెలిపారు.