హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ మేరకు జేఏసీకి ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ తమ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ, ఏరియర్స్, సంఘాల పునరుద్ధరణ, ఎలక్ట్రిక్ బస్‌లు సంస్థకే అప్పగింత వంటి డిమాండ్ల సాధన పోరాటంలో తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు జేఏసీకి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికుల పక్షాన అవసరమైతే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని స్పష్టంచేశాయి. గురువారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కేంద్ర కార్యాలయంలో ‘ఆర్టీసీ పరిరక్షణ-ప్రభుత్వ హామీలు’ అన్న అంశంపై జాతీయ కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వీ రాములు మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజారవాణాను రాష్ట్ర పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే వేలాది ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను కార్పొరేట్ శక్తుల ద్వారా ప్రవేశపెడుతూ, ఆర్టీసీ స్థలాలను, డిపోలను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులతోపాటు సిబ్బందిని బలవంతంగా బయటకు గెంటివేయడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తుందని, ఆర్టీసీ కార్మికుల ఐక్య పోరాటాల్లో తాము కూడా కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ విలీనం, వేతన సవరణ వంటి డిమాండ్ల సాధన కోసం జేఏసీ తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక నుంచి కార్మికుల పక్షాన ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమాలపై ఉకుపాదం మోపుతూ, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నుతున్నదని ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కండక్టర్, డ్రైవర్, మెకానిక్‌లను నియమిస్తున్నారని, కాంట్రాక్ట్ పద్ధతిలో సూపర్వైజర్లు, ఇతర అధికారులను నియమిస్తున్నారని తెలిపారు. ప్రజారవాణా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నదని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా 15 గంటల వరకు సిబ్బందితో విధులు చేయించడాన్ని ఆక్షేపించారు.
మహాలక్ష్మీ పథకం ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి తగువు పెట్టిందని టీయూసీఐ ప్రధాన కార్యదర్శి ఎస్ఎల్ పద్మ ఆరోపించారు. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచకపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. సామాన్యుల ప్రయాణానికి భారంగా ఉన్నా ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు పెంచి ఉన్నత వర్గాలకు మేలు చేస్తున్నారని విమర్శించారు. మహిళా కండక్టర్లకు కనీస సదుపాయాలను సంస్థ కల్పించడం లేదని పేర్కొన్నారు. ప్రైవేటుపరం కాకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు, నిరుద్యోగులు, రైతు కూలీలు, అసంఘటిత కార్మికులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, మేధావులపై ఉన్నదని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష పోరాటాలు చేపడుతామని జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, బీ యాదగిరి, కోశాధికారి బీ యాదయ్య, సత్యం, జే రాఘవులు, బీ గోపాల్, కే మనోహర్, డీ రాంచందర్ స్పష్టంచేశారు.
‘ఎలక్ట్రిక్ బస్సులు గోబ్యాక్’ అన్న నినాదాన్ని ఆర్టీసీ కార్మికులు గొంతెత్తి నినదించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఒక ప్రకటనలో కోరింది. ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసేలా విధానాలు రూపొందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈనెల 30న ఎలక్ట్రిక్ బస్సులు నడిచే డిపోల ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వేలాదిగా ఆర్టీసీకి బలవంతంగా కట్టబెట్టి ఆర్టీసీ డిపోలు, స్థలాలు కార్పొరేట్ శక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ధారాధత్తం చేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది.