KTR | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల పాటు దగాపడ్డ చేనేత రంగానికి బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఓ స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం చేనేత కార్మికులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల కష్టాన్ని, వారి కృషిని గుర్తుచేశారు. ‘నరాలను పోగులుగా, రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా, చెమట చుకల్ని చీరలుగా, పేగులను వస్త్రాలుగా అందించి మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని తెలిపారు.
సమైక్య పాలనలో దగాపడ్డ చేనేత రంగానికి.. బీఆర్ఎస్ పదేండ్ల పాలన దేశ చరిత్రలోనే స్వర్ణయుగమని అన్నారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు.. మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు.. వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన పాలకుడు కేసీఆర్ అని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఆరేండ్ల బడ్జెట్ రూ.600 కోట్లే ఉంటే, బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి రూ.1200 కోట్లు అని వివరించారు. దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో ‘చేనేత మిత్ర’, నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం, ‘నేతన్నకు బీమా’ పేరుతో 5 లక్షల రూపాయల ధీమా 36 వేల మంది నేతన్నల కుటుంబాలకు కొండంత అండగా ఉన్నాయని వెల్లడించారు. 10,150 మంది చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రూ.29 కోట్ల రుణాల మాఫీ చేసి, ఆసరా పెన్షన్‌తో ఆపన్న హస్తం అందించి.. పద్మశాలీల ఆత్మగౌరవం పెంచే చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.
సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని బతికించేందుకు బతుకమ్మ చీరల పంపిణీని చేపట్టారని తెలిపారు. సిరిసిల్లలో అపారెల్ పార్, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ సంచలనాలని అన్నారు. అయితే, కాంగ్రెస్, బీజేపీ పాలనలో నేతన్నల బతకులు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే హయాంలో.. తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్ను, ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, ఆలిండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు రద్దు, ఆలిండియా పవర్లూమ్ బోర్డు రద్దు, చేనేత కార్మికుల త్రిఫ్ట్ పథకం రద్దు, హౌస్ కం వర్ షెడ్ పథకాల రద్దు, మహాత్మాగాంధీ బునకర్ బీమా పథకం రద్దు, యార్న్‌పై సబ్సిడీ 40% నుంచి 15 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో రేవంత్ పాలన వల్ల చేనేత రంగం మళ్లీ మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోయిందని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కండ్లు తెరిచి, బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించి, సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెకించాలని డిమాండ్ చేశారు.
చేనేతలను ఆదుకోవాలిప్రభుత్వానికి నేతన్నల వేడుకోలు
ఏడు నెలలుగా చేనేతల జీవితాలు దుర్భరంగా మారాయని, తమను ఆదుకోవాలని నేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అఖిలభారత, తెలంగాణ పద్మశాలీల సంఘాల సం యుక్త ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యా లీ నిర్వహించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు స్వామి, యువజన ఇన్చార్జి భాస్క ర్, మహిళా అధ్యక్షురాలు రూప, తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ముర ళి, జ్ఞానేశ్వర్, ఉమ్మడి నల్లగొండ చేనేత సహకార సంఘాల అసోసియేసషన్ అధ్యక్షుడు రామచంద్రం, సత్యనారాయణ, శంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.