హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కంద్లాపూర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మృతిపై జాతీయ మహిళా కమిషన్ ఆరా తీసింది. శిరీష మృతిపై విచారణ వేగవంతం చేయాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది. వీలైంత త్వరగా వివరణాత్మక నివేదికను అందించాలని కోరింది. గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో శిరీష మృతి మిస్టరీని ఛేదించడం కొంత ఇబ్బందిగా మారింది. శిరీష మృతికి కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు సోమవారం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి విసెరా నమూనాలను పంపారు. అత్యాచారం సహా పలు కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి పలు వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మృతి చెందిన సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కండ్లు పదునైన వస్తువుతో పొడిచినట్టు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమెపై అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోవడానికి బాధితురాలి ఇంట్లో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఆత్మహత్య అని ప్రాథమికంగా అనుమానించిన పోలీసులు.. ఆమె కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు.