Telangana | హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్పార్లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం ఆమె సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పరేడ్‌గ్రౌండ్‌లో ఉదయం ఏర్పాటు చేసే కార్యక్రమంలో సీఎం రాష్ట్ర గీతాన్ని ఆవిషరించడంతోపాటు సందేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై రాష్ట్రంలోని అన్నీ కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనితో పాటు శిక్షణ పొందుతున్న ఐదువేల మంది పోలీస్ అధికారులు బ్యాండ్‌తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారని వివరించారు.
ట్యాంక్‌బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటుచేస్తామని చెప్పారు. హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారుచేసిన పలు వస్తువులతోపాటు హైదరాబాద్‌లోని పేరొందిన హోటళ్ల ఆధ్యర్వంలో ఫుడ్‌స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటుచేయనున్నట్టు పేరొన్నారు. ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన పటాకుల ప్రదర్శనతోపాటు లేజర్‌షో ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు. ట్యాంక్‌బండ్‌పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లుచేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రభు త్వ ముఖ్య కార్యదర్శులు దానకిశోర్, శైలజారామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, అడిషనల్ డీజీలు సంజయ్‌కుమార్‌జైన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఎన్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్, హెచ్ఎండీఏ అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, మేయర్లు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్ పర్సన్లు, వివిధ విభాగాల హెచ్వోడీలు తమ కార్యాలయాల్లో జూన్ 2న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సూచించారు.